రామ్ చరణ్ నిజంగా సీతారామరాజేనా?

రామ్ చరణ్ నిజంగా సీతారామరాజేనా?

‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్‌ది అల్లూరి సీతారామరాజు పాత్ర అని.. ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్ చేస్తున్నాడని రాజమౌళి ఏడాది కిందటే వెల్లడించాడు. వేర్వేరు కాలాలకు చెందిన ఈ వ్యక్తులు ఒకే కాలంలో కలిస్తే ఎలా ఉంటుందనే కల్పిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది, ఆ పాత్ర ఆహార్యం ఏంటి అన్నది ఇంతకుముందు లీకైన ఓ సన్నివేశంతోనే అర్థమైపోయింది. కొమరం భీమ్ లుక్ విషయంలో బయట జనాలకు ఉన్న అంచనాలకు తగ్గట్లే తారక్ కనిపించాడు.

తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్లో కూడా పాత కాలం నాటి ఆహార్యంతోనే కనిపించాడు తారక్. కానీ రామ్ చరణ్ మాత్రం ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా కనిపించి ఆశ్చర్యపరిచాడు.

అల్లూరి సీతారామరాజు అనగానే జనాలకు సంప్రదాయ వస్త్రధారణ గుర్తుకొస్తుంది. ‘అల్లూరి సీతారామరాజు’లో కృష్ణ.. ‘మేజర్ చంద్రకాంత్‌’లో ఎన్టీ రామారావు కనిపించిన లుక్‌తో చరణ్‌ను ఊహించుకుంటున్నారు జనం. సినిమాలో కూడా అదే తరహా లుక్ ఉంటుందని ఆశించారు.

కానీ ‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్లో మాత్రం చరణ్ ప్యాంటు చొక్కాతో ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా దర్శనమిచ్చి షాకిచ్చాడు. అల్లూరి సీతారామరాజు ఈ లుక్‌తో ఉన్నట్లుగా ఇప్పటిదాకా చరిత్రలో ఎలాంటి సంకేతాలు కనిపించలేదు.

మరి రాజమౌళి పరిశోధనలో అల్లూరి ఏదో ఒక దశలో ప్యాంటూ చొక్కా వేసినట్లు తెలిసిందా.. లేక ఎలాగూ కల్పిత కథే కదా అని స్వేచ్ఛ తీసుకుని చరణ్‌తో ప్యాంటూ షర్టూ వేయించాడా అన్నది తెలియదు మరి. ఇంతకీ సినిమా అంతటా కూడా చరణ్ ఇలా కనిపిస్తాడా.. లేక ప్రేక్షకుల ఊహల్లో ఉన్న సీతారామరాజుగా కథ ముందుకు సాగాక మారతాడా అన్నది చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English