‘మంచి’ సినిమాలు వద్దు బాబోయ్

‘మంచి’ సినిమాలు వద్దు బాబోయ్

హీరో రాముడు మంచి బాలుడిలా ఉంటే అస్సలు నచ్చట్లేదు ఈ తరం ప్రేక్షకులకు. కొంచెం తిక్క తిక్కగా.. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అయితేనే ప్రేక్షకులకు రుచిస్తోంది. పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు మన ప్రేక్షకుల్ని అలా మార్చేశారు. హీరోలో అన్నీ మంచి లక్షణాలే ఉండి.. అతను అన్నీ మంచి పనులే చేసి.. ఏదో మంచి చెప్పాలని, సందేశాలివ్వాలని చూస్తే జనాలకు మొహం మొత్తేస్తోంది.

ఇలా ‘మంచి’ చెప్పబోయిన సినిమాలు గత కొన్నేళ్లలో దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. అందుకు ‘బ్రహ్మోత్సవం’ ఒక పెద్ద ఉదాహరణ. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో శ్రీకాంత్ అడ్డాల మంచి విషయాలు చెబితే బాగానే రిసీవ్ చేసుకున్నారు. తాను చెప్పాలనుకున్న విషయాల్ని సుగర్ కోటింగ్‌తో చెప్పాడు శ్రీకాంత్.

కానీ ఆ సినిమా మంచి ఫలితాన్నందుకునేసరికి అతను హద్దులు దాటిపోయాడు. ‘బ్రహ్మోత్సవం’లో ఒక మంచి మాట.. ఒక మంచి మాట అంటూ ప్రేక్షకుల్ని విసుగెత్తించేశాడు. ఆ తర్వాత ‘శతమానం భవతి’లో సతీశ్ వేగేశ్నే సైతం తాను చెప్పాలనుకున్న మంచి విషయాల్ని అంతర్లీనంగానే చెప్పాడు. కానీ ‘శ్రీనివాస కళ్యాణం’ దగ్గరికి వచ్చేసరికి శ్రీకాంత్ లాగే అతనూ పట్టు తప్పాడు. విపరీతంగా క్లాసులు పీకి ప్రీచీగా తయారు చేసి పెట్టాడు సినిమాను. అది బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనిపించింది.

దీన్నుంచి పాఠాలు నేర్చుకుంటాడని అనుకుంటే ‘ఎంత మంచివాడవురా’ అంటూ అతి మంచి సినిమా తీయబోయి బొక్క బోర్లా పడ్డాడు. ఈ సినిమాలో అతను చెప్పాలనుకున్న మంచి ఎంతమాత్రం ప్రేక్షకులకు ఎక్కలేదు. ఈ దెబ్బతో ఈ తరహా ‘మంచి’ సినిమాలంటే జనాలకు బాగా మొహం మొత్తేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English