ట్రోల్స్ మోత.. హీరోయిన్ 'స్వరం' మార్చేసింది

ట్రోల్స్ మోత.. హీరోయిన్ 'స్వరం' మార్చేసింది

స్వర భాస్కర్.. సినిమాలతో ఈ అమ్మాయికి పెద్ద పేరేమీ రాలేదు. కానీ వివాదాలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స్వర.. వివాదాస్పద అంశాలపై చాలా దూకుడుగా మాట్లాడుతుంటుంది. ఆమె పాల్గొనే టీవీ షోల్లోనూ బోల్డ్ కామెంట్స్ చేస్తుంటుంది. ఈ మధ్య ఇలాగే ఒక షోలో భాగంగా ఆమె పిల్లల్ని దయ్యాలతో పోల్చడం దుమారం రేపింది.

ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణ సమయంలో ఓ బాలనటుడు తనను 'ఆంటీ' అన్నాడని వెల్లడిస్తూ.. ఆ బాలుడిని ఉద్దేశించి అసభ్య పదజాలాన్ని కూడా వాడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. గత వివాదాల్ని కూడా తవ్వి తీస్తూ ఆమెను ట్రోల్ చేశారు. పెద్ద ఎత్తున మీమ్స్ కూడా వచ్చాయి. పబ్లిసిటీ కోసం స్వర ఇలాంటివి చేస్తుందంటూ నెటిజన్లు ఆమె గాలి తీసే ప్రయత్నం చేశారు.

పిల్లల మీద చేసిన కామెంట్లు కావడంతో తనపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని గుర్తించిన స్వర.. స్వరం మార్చేసింది. తాను ఆ టీవీ షోలో పిల్లల గురించి సరదాగానే కామెంట్స్ చేశానని.. జనాలు అపార్థం చేసుకున్నారని అంది. నిజానికి పిల్లలంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. ''నేను ఆ పిల్లాడిన ఆ మాట సరదాగా అన్నాను. ఎందుకంటే నేను పాల్గొన్నది ఒక కామెడీ షోలో. ముంబయిలో నా తొలి షూటింగ్‌ అనుభవాన్ని సరదాగా చెప్పాను. అక్కడ నేను కొంతమేర అసభ్య పదజాలాన్ని వాడాను. పెద్దవాళ్లకు అర్థమయ్యేలా హస్యాస్పదంగా ఆ మాటలను వాడానే కానీ, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కాదు. ఆ కామెడీ షో ఎలా నడుస్తుందో తెలిస్తే నా మాటల ఉద్దేశం ప్రతిఒక్కరికీ అర్థమవుతుంది.

నిజానికి చిన్నారులంటే నాకిష్టం. చిన్నారుల సంక్షేమం కోసం నేను ఎప్పుడూ ముందు ఉంటాను. వాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. చిన్నారులను దెయ్యాలతో పోల్చింది సరదాగానే''' అని స్వర వివరణ ఇచ్చింది. ఐతే ఈ వివరణపై నెటిజన్లు అంత సానుకూలంగా స్పందించట్లేదు.
   

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English