బీజేపీకి అలా చెక్ పెట్టిన జ‌గ‌న్

ఏపీలో ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నిస్తూ వైసీపీని ఇరుకున పెట్టాల‌ని చూస్తున్న బీజేపీపై జ‌గ‌న్ నేరుగా కౌంట‌ర్లు వేయ‌క‌పోయినా.. ఇత‌ర మార్గాల్లో మాత్రం దీటుగా స్పందిస్తున్నారు. మ‌తం పేరుతో జ‌నాల్ని రెచ్చ‌గొట్టే అవ‌కాశాన్ని బీజేపీకి ఇవ్వ‌కుండా వైసీపీ తెలివిగా వ్య‌వ‌హ‌రించింద‌ని ప్ర‌స్తుతం అక్క‌డి ప్ర‌జ‌లు మాట్లాడుకుంటున్నారు. చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన జ‌గ‌న్.. ఈ విష‌యంలో బీజేపీకి చెక్ పెట్టార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ఏపీలో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ మ‌తాన్నే న‌మ్ముకుంద‌ని ఇప్ప‌టికే విమ‌ర్శ‌లున్నాయి. జ‌గ‌న్ క్రిస్టియ‌న్ కావ‌డంతో ఆ అవ‌కాశాన్ని వాడుకుని మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తుంద‌ని వైసీసీ నేత‌లు ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ఏపీలో హిందువుల ఆల‌యాల ధ్వంసం, ర‌థాలు, విగ్ర‌హాల ద‌హ‌నం అధికార పార్టీ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతుంద‌ని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్ర‌మంలోనే గుంటూరులోని జిన్నాట‌వ‌ర్‌ను బీజేపీ ఓ అస్త్రంగా ఎంచుకుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

దాన్ని కూల‌గొట్టాల‌ని ఆ సెంట‌ర్‌కు జిన్నా పేరు తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ బీజేపీ గ‌తంలో ఆందోళ‌న‌కు దిగింది. ఇప్పటికీ ఈ విష‌యంపై వైసీపీని ప్ర‌శ్నిస్తూనే ఉంది. సున్నిత‌మైన అంశం కావ‌డంతో వైసీపీ కూడా జాగ్ర‌త్త‌గా అడుగులు వేసింది. ఒక్క నిర్ణ‌యంతో ఇప్పుడు బీజేపీకి చెక్ పెట్టింది. అదే జిన్నా ట‌వ‌ర్‌కు జాతీయ ప‌తాక రంగులు వేయ‌డం. దీంతో బీజేపీకి ఎలాంటి ర‌చ్చ చేసే అవ‌కాశం ఇవ్వ‌కుండా వైసీపీ వ్య‌వ‌హ‌రించిందని నిపుణులు చెబుతున్నారు.

ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు గుంటూరు మేయ‌ర్ శివ‌నాగ మ‌నోహ‌ర్ నాయుడు, తూర్పు ఎమ్మెల్యే మ‌హ‌మ్మ‌ద్ ముస్త‌ఫా జిన్నా ట‌వ‌ర్ విష‌యంలో గుంటూరు వాసుల అభిప్రాయాలు తీసుకున్నారు. అనంత‌రం ట‌వ‌ర్‌కు జాతీయ జెండా రంగులైన కాషాయం, తెలుపు, ఆకుప‌చ్చ రంగులు వేయించారు. అంతే కాకుండా ఈ నెల 3న జిన్నా ట‌వ‌ర్ వ‌ద్ద జాతీయ ప‌త‌కం ఎగ‌రేయాలని తీర్మానించారు. దీనిపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. బీజేపీ మ‌త రాజ‌కీయాల‌కు.. వైసీపీ జాతీయ వాదంతో దెబ్బ‌కొట్టింద‌ని నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు.