చంద్రబాబుకు కరోనా పాజిటివ్ పై సీఎం జగన్ ట్వీట్

ఇప్పుడు నడుస్తున్నదంతా సోషల్ మీడియా. అత్యంత కీలక స్థానాల్లో ఉన్న వారు.. మిగిలిన పనుల విషయంలో ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం మహా చురుగ్గా ఉండటం కనిపిస్తుంది. తానుస్పందించాల్సిన కీలక విషయాల్ని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికి ఒక్క క్లిక్ తో చేర్చేసే సోషల్ మీడియాను కీలక మాధ్యమంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచమంతా ఒకలా వ్యవహరిస్తే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పాలి.

ఆయన వ్యక్తిగత ట్విటర్ ఖాతాను చూస్తే.. ఒక్కోసారి వరుస పెట్టి రోజూ ట్వీట్లు చేయటం కనిపిస్తుంది. ఒక్కోసారి రోజుకో ట్వీట్ చొప్పున పోస్టు చేసే ఆయన.. మరికొన్ని సందర్భాల్లో నాలుగైదు రోజులు గడిచినా మరే ట్వీట్ పెట్టటం కనిపించదు. అలాంటి ఆయన తాజాగా స్పందించారు. ఆయన తన చివరి ట్వీట్ ను సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత నుంచి ఆయన నుంచి ఎలాంటి ట్వీట్ పోస్టు కాలేదు.

తాజాగా ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు కరోనా టెస్టులో పాజిటివ్ రావటం.. ఆయన ఆ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా చంద్రబాబుకు పాజిటివ్ అన్న అంశంపై స్పందించిన సీఎం జగన్.. త్వరగా కోలుకోవాలని.. మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరారు. జనవరి 14 తర్వాత ఆయన చేసిన మొదటి ట్వీట్ ఇదే కావటం గమనార్హం. ‘చాలా త్వరగా కోలుకోవాలని.. మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను చంద్రబాబు గారు అంటూ పేర్కొన్నారు. మొత్తానికి మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుకు పాజిటివ్ అయిన వెంటనే.. జగన్ రియాక్టు కావటం గమనార్హం.