‘వాల్మీకి’ పేరు మారిందా.. మంచిదేగా

‘వాల్మీకి’ పేరు మారిందా.. మంచిదేగా

తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ చూడనిది, విననిది జరిగింది. ఒక సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు దాని పేరు మార్చారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘వాల్మీకి’ చిత్రం పేరును.. నిన్న రాత్రి ‘గద్దలకొండ గణేష్’గా మార్చడం అనూహ్యమే. వాల్మీకి పేరు మార్చాలని వాల్మీకిబోయ సంఘాలు చాన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

ఐతే వాళ్ల అభ్యంతరాల్ని చిత్ర బృందం పట్టించుకున్నట్లుగా లేదు. తమ సినిమా వాల్మీకి మహర్షి గురించి జనాలకు మరింత తెలిసేలా చేస్తుందని, ఆయన గొప్పదనాన్ని ఎంతమాత్రం తగ్గించదని దర్శకుడు హరీష్ శంకర్ ముందు నుంచి చెబుతూ వస్తున్నాడు. దీనికే స్టాండ్ అయి టైటిల్ మార్చలేదు. ఐతే ఆందోళనకారులు ఏం చేస్తారులే అనుకున్నారు కానీ.. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సినిమా విడుదలను ఆపించేశారు. కలెక్టర్ల ఆదేశాలతో చిత్ర బృందం తలొగ్గక తప్పలేదు.

ఈ పరిణామంపై చిత్ర పరిశ్రమ తీవ్ర అసహనానికి గురవుతోంది. చివరి నిమిషాల్లో ఇలా టైటిల్ మార్చుకోవాల్సి రావడం దారుణం అంటున్నారు. ఇక సినిమా వాళ్లకు క్రియేటివ్ ఫ్రీడం ఎక్కడుంటుంది అంటున్నారు. కానీ ఈ పరిణామం చూసి సంతోషించేవాళ్లూ లేకపోలేదు. కానీ వాళ్లు మరీ మురిసిపోవాల్సిన పనైతే లేదు. ‘వాల్మీకి’ పేరు మార్పు వల్ల సినిమాకు వచ్చిన నష్టమేమీ లేదు. పైగా లాభమే. విడుదలకు కొన్ని గంటల ముందు పేరు మార్చడం వల్ల సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ వస్తోంది. దీని గురించి రాత్రి నుంచే సోషల్ మీడియా మోతెక్కిపోయింది.

ఉదయం నుంచి మామూలు జనాలు కూడా మాట్లాడుకుంటారు. వాళ్లలో సానుభూతి కూడా వస్తోంది. హరీష్ శంకర్ నిన్న రాత్రి ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలతో అది మరింత పెరుగుతుంది. పేరు మార్చినా కూడా ఈ చిత్రాన్ని జనాలు ‘వాల్మీకి’గానే చెప్పుకుంటారు. సాంకేతికంగా మాత్రమే పేరు మారినట్లు. కాబట్టి ఏ రకంగానూ పేరు మార్పు చెడు కాదు. మంచికే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English