ఆ వైసీపీ సీనియ‌ర్‌కు తిప్పలు.. ముగిసిన‌ట్టేనా?

రాజ‌కీయాల్లో ఆయ‌న సీనియ‌ర్‌. మాజీ మంత్రి కూడా. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లి.. త‌ర్వాత మ‌ళ్లీ టీడీపీలోకి వ‌చ్చి.. త‌ర్వాత‌.. వైసీపీ పంచ‌న చేరారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో మాత్రం ఆయ‌న జాడ ఎక్క‌డా క‌నిపించడం లేదు. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు ఒక వెలుగు వెలిగిన బాప‌ట్ల మాజీ ఎమ్మెల్యే గాదె వెంక‌ట‌రెడ్డి రాజ‌కీయాలు ఇక ముగిసిన‌ట్టేనా ? అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయ‌న‌.. త‌ర్వాత టీడీపీలోకి వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే త‌న కుమారుడికి టికెట్ ఆశించారు. అయితే.. అది ద‌క్క‌లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఆప‌లేదు. అయినా.. అవ‌కాశం చిక్క‌లేదు.

దీంతో వైసీపీ బాట‌ప‌ట్టారు. క‌నీసం.. ఏదో ఒక ప‌ద‌వి అయినా.. ద‌క్కుతుంద‌ని ఆశించ‌రు. గతంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరున్న ఆయ‌న‌.. జ‌గ‌న్ హ‌యాంలో మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. క‌నీసం ఎమ్మెల్సీ అయినా.. ద‌క్క‌క పోతుందా? అని ఎదురు చూసినా.. దానిపై ఆశ‌లు క‌నిపించ‌లేదు. ఇక‌, విసిగి వేసారి ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఆయ‌న కుమారుడు కూడా బాప‌ట్ల టికెట్‌పై ఆశ‌లు పెట్టుకున్నా.. ఇప్ప‌ట్లో అవ‌కాశం లేద‌ని.. పార్టీ ఎప్పుడో స్ప‌ష్టం చేసింది.

ఇక‌, అప్ప‌టి నుంచి గాదె రాజ‌కీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే.. రాజకీయంగా ఇరు రాష్ట్రాల్లోనూ మంచి ప‌లుకుబ‌డి ఉన్న గాదె కుటుంబం.. ఎప్ప‌టికైనా.. మ‌ళ్లీ త‌మ హవా సాగిస్తుంద‌ని.. సీనియ‌ర్లు చెబుతున్నారు. కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటే.. మ‌ళ్లీ ఆ పార్టీలోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ ఇప్ప‌ట్లో పుంజుకునే అవ‌కాశం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీంతో కాంగ్రెస్ పుంజుకుంటుంద‌నే ఆశ‌లు మాత్రం వీరిలో స‌జీవంగా ఉన్నారు. అయితే.. ఇక్క‌డ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో టాక్ వినిపిస్తోంది.

అస‌లు వైసీపీలో చేరారే త‌ప్ప‌.. ఎప్పుడైనా యాక్టివ్ రోల్ పోషించారా?  పార్టీ కోసం గాదె కుటుంబం ఎప్పుడైనా జెండా ప‌ట్టుకుని.. రోడ్డెక్కిందా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఇవి కూడా వాస్త‌వ‌మే. గాదె ఫ్యామిలీ.. కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు కొంత మేర‌కు క‌ష్ట‌ప‌డినా.. త‌ర్వాత టీడీపీలో చేరినా.. ఇప్పుడు వైసీపీలో ఉన్నా.. ఏనాడూ రోడ్డెక్కింది లేదు. పార్టీ కోసం ప‌నిచేసింది లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ నేప‌థ్యం కూడా వారి రాజ‌కీయాలు ముగిసిపోవ‌డానికి కార‌ణ‌మ‌ని అంటున్నారు.