జగపతి లాగే రాజేంద్రుడు కూడా..

జగపతి లాగే రాజేంద్రుడు కూడా..

చాలా ఏళ్ల పాటు హీరోలుగా నటించాక క్యారెక్టర్ రోల్స్ లోకి మారాలంటే కష్టమే. కానీ వాస్తవాన్ని అంగీకరించలేక మార్కెట్ కోల్పోయాక కూడా లీడ్ రోల్స్‌లో సినిమాలు చేస్తూనే ఉంటారు. చివరికి జీరో మార్కెట్ స్థాయికి వచ్చాక కానీ హీరో పాత్రలు వదలరు. రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు లాంటి వాళ్లు ఈ కోవకే చెందుతారు. లేటు వయసులోనూ హీరో పాత్రలు కంటిన్యూ చేసిన ఈ ఇద్దరూ ప్రత్యేక పాత్రలతో బ్రేక్ వచ్చాక హీరో వేషాలు వదిలేశారు.

ఇద్దరూ ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు. ఐతే విలన్, క్యారెక్టర్ రోల్స్‌లో ఫుల్ బిజీ అయ్యాక కూడా జగపతి హీరోగా మారి ‘పటేల్ సార్’ అనే సినిమా చేశాడు. అదెంత దారుణమైన ఫలితాన్నందుకుందో తెలిసిందే. దీంతో  మళ్లీ లీడ్ రోల్స్ వైపు చూడలేదు జగపతి.

ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ సైతం ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. మళ్లీ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. దాని పేరు.. కాలేజ్ కుమార్. ఈ రోజు రాజేంద్రుడి పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. దీని టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఏఎన్నార్ లేటు వయసులో నటించిన ‘కాలేజ్ కుమార్’ గుర్తుకు తెస్తోంది. పోస్టర్ మీద దర్శకుడు, నిర్మాత అని వేయకుండా.. ప్రిన్సిపాల్, ఫౌండర్ అని.. ఇతర సాంకేతిక నిపుణుల పేర్ల ముందు లెకరర్స్ అని వేయడం విశేషం.

హరి సంతోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని పద్మనాభ నిర్మిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్‌తో పాటు మధుబాల, రాహుల్ విజయ్, ప్రియ వడ్డమాని ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే ఈ వయసులో మళ్లీ హీరోగా నటించిన రాజేంద్రుడికి  బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English