రకుల్‌కు నాగ్ టైటిల్ త్యాగం.. ఫ్యాన్స్ హర్టు

రకుల్‌కు నాగ్ టైటిల్ త్యాగం.. ఫ్యాన్స్ హర్టు

కొన్ని నెలల కిందటే తన సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ పెట్టి చిన్న టీజర్ ఒకటి వదిలాడు నేచురల్ స్టార్ నాని. అతను పేరున్న హీరోనే.. అందరూ  అభిమానించే నటుడు.. అయినా సరే.. ఈ టైటిల్ పెట్టుకున్నందుకు వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. మెగా అభిమానులు నాని సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నానిని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. నాని చేస్తేనే అలా ఉంటే.. ఊరూ పేరు లేని ఓ కొత్త హీరో తన సినిమాకు ఒక సీనియర్ హీరో టైటిల్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అదే పని చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా టైటిల్‌ను తన చిత్రానికి పెట్టుకున్నాడు అమన్ ప్రీత్.

కొన్ని నెలల కిందటే అమన్ ప్రీత్ హీరోగా ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. వైంకుఠ్ బోను అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి ‘నిన్నే పెళ్లాడతా’ టైటిల్ ఖరారు చేశారు. నాగార్జున స్వయంగా ఈ సినిమా టైటిల్ లోగోను ఆవిష్కరించడం విశేషం. ప్రస్తుతం రకుల్‌తో కలిసి ‘మన్మథుడు-2’ చేస్తున్నాడు నాగ్. ఆమె కోరిక మేరకే ‘నిన్నే పెళ్లాడతా’ టైటిల్ లోగోను తన చేతుల మీదుగా ఆవిష్కరించినట్లున్నాడు నాగ్. ఐతే ఈ టైటిల్‌ను నాగ్ కొడుకుల్లో ఎవరైనా పెట్టుకుంటే బాగుంటుందన్నది అక్కినేని అభిమానుల అభిప్రాయం. ఒక సినిమా వచ్చిన పదేళ్ల తర్వా తఎవరైనా ఆ టైటిల్ వాడుకోవచ్చు. కానీ ‘నిన్నే పెళ్లాడతా’ లాంటి ఐకానిక్ సినిమాల టైటిళ్లు ఎవరు పడితే వాళ్లు పెట్టుకుంటే సామాన్య ప్రేక్షకులకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. చిరు టైటిల్‌ను నాని పెట్టుకోవడమే మెగా అభిమానులు తట్టుకోలేనపుడు.. నాగ్ టైటిల్‌ను ఒక అనామక హీరో పెట్టుకోవడం, దాన్ని నాగ్ స్వయంగా ఆవిష్కరించడం అక్కినేని అభిమానులకు అస్సలు నచ్చడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English