టాలీవుడ్ భామను కోలీవుడ్ ఆదుకుంది

టాలీవుడ్ భామను కోలీవుడ్ ఆదుకుంది

ఈ సంక్రాంతికి 'ఎఫ్-2' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకుంది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్. ఆ విజయంలో మెహ్రీన్ పాత్ర కూడా కీలకమే. ఆ చిత్రంలో మెహ్రీన్ పోషించిన హనీ పాత్ర బాగా పేలింది. నటన విషయంలోనే కాదు.. గ్లామర్‌ పరంగానూ ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. సాధారణంగా ఇలాంటి బ్లాక్ బస్టర్ పడగానే అవకాశాలు వరుస కడతాయి. కానీ అంత పెద్ద హిట్టు కొట్టి, తన పాత్రతో మంచి పేరు సంపాదించినప్పటికీ తర్వాత అవకాశాలే లేవు మెహ్రీన్‌కు.

ఒకప్పుడు వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్నప్పటికీ మెహ్రీన్‌కు అవకాశాలు ఆగలేదు. కానీ ఇప్పుడు బ్లాక్‌బస్టర్ తర్వాత కూాడా ఛాన్సుల్లేవేంటా అని ఆమె బాధ పడే పరిస్థితి వచ్చింది. అప్పటికే కమిటైన విజయ్ దేవరకొండ-క్రాంతి మాధవ్ చిత్రం మినహా కొత్తగా ఆమె ఖాతాలోకి ఒక్క సినిమా కూడా చేరలేదు.

ఇలాంటి సమయంలో మెహ్రీన్‌ను కోలీవుడ్ ఆదుకుంటోంది. అక్కడ స్టార్ హీరో ధనుష్ సరసన ఓ అవకాశం పట్టేసింది మెహ్రీన్. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో 'అసురన్' సినిమా చేస్తున్న ధనుష్.. దాన్ని పూర్తి చేసి దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇంతకుముందు వీళ్ల కాంబినేషన్లో వచ్చిన 'కొడి' (తెలుగులో ధర్మయోగి) సూపర్ హిట్టయింది. ఈ కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రంలో మెహ్రీన్‌ను లీడ్ హీరోయిన్‌గా తీసుకున్నారు.

ఇప్పటికే 'కేరాఫ్ సూర్య', 'నోటా' సినిమాలతో కోలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది మెహ్రీన్. అవి తీవ్ర నిరాశకు గురి చేయగా.. ఇప్పుడు టాలీవుడ్లోనూ కెరీర్ అంతంతమాత్రంగా ఉన్న సమయంలో తమిళంలో పెద్ద అవకాశం రావడంతో మెహ్రీన్ చాలా సంతోషంగానే ఉండి ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English