పెరుగు బాలేదని విడాకుల వరకు వెళ్లిన తేజ

పెరుగు బాలేదని విడాకుల వరకు వెళ్లిన తేజ

దర్శకుడు తేజకు కోపం ఎక్కువన్న సంగతి తెలిసిందే. షూటింగ్ టైంలో అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే ఆయనకు చేయి లేస్తుందంటారు. కోపం ఆపుకోలేక నటీనటుల్ని కొట్టినట్లు కూడా చెబుతుంటారు. వేదికలు ఎక్కినపుడు, ఇంటర్వ్యూల్లో కూడా తేజ తన కోపాన్ని బయట పెట్టేస్తుంటాడు. ఏమనిపిస్తే అది మాట్లాడేస్తుంటాడు. మరి ఆయన ఇంట్లో మనుషులతో ఎలా ఉంటారు? భార్యాపిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారు అన్న ఆసక్తి కలగడం ఖాయం. ఐతే ఇంట్లో వాళ్లతోనూ ఆయన కొంచెం కఠినంగానే ఉంటారట. తాను కోరుకున్నట్లు పెరుగు తయారు చేయలేదని భార్యతో విడాకులు తీసుకునేవరకు వెళ్లినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తేజ వెల్లడించడం విశేషం.

‘‘నాకు భోజనంలో తప్పకుండా పచ్చడి, పెరుగు ఉండాలి. ఇంట్లో ఒకసారి మూడు రోజులుగా వరుసగా పెరుగు బాగాలేదు. నా భార్య శ్రీవల్లిపై సీరియస్‌ అయ్యాను. అయినా తర్వాత కూడా పెరుగు రుచి మారలేదు. నాకు కోపం వచ్చింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆ గొడవ విడాకుల వరకూ వెళ్లింది. అది తర్వాత సద్దుమణిగింది. ఐతే పెరుగు కోసం విడాకులిస్తానన్నావా అంటూ మా పిల్లలు నన్ను ఇప్పటికీ ఏడిపిస్తూ ఉంటారు’’ అని తేజ చెప్పాడు.

తాను కెమెరా అసిస్టెంటుగా పని చేస్తున్న రోజుల్లో తన చెల్లి ద్వారా శ్రీవల్లి పరిచయం అయిందని.. ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగి ఒప్పించానని.. కానీ వాళ్లింట్లో వాళ్లు తనకంటూ ఒక కుటుంబం లేదని, సినిమాల్లో కూడా స్థిరపడలేదని తనకు వాళ్లమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడలేదని.. ఆ సమయంలో అక్కినేని వెంకట్ భార్య జ్యోత్స్న అమ్మాయి వాళ్లింట్లో మాట్లాడి, తన గురించి వాళ్లకు హామీ ఇచ్చి పెళ్లి చేయించినట్లు తేజ వెల్లడించాడు. వెంకట్ కుటుంబం ఇప్పటికీ తన భార్యను సరిగా చూసుకుంటున్నానో లేదో వాకబు చేస్తుంటారని తేజ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English