అరగంటకో ప్రెస్ మీట్ అన్న టీడీపీ..

అరగంటకో ప్రెస్ మీట్ అన్న టీడీపీ..

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తొలి గంటలోనే స్పష్టత వచ్చేసింది. ఆరంభం నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు మొదలైంది. చాలామంది అనుకున్నట్లు ఏపీలో హోరాహోరీ పోరేమీ కనిపించలేదు. ఏక పక్ష విజయం దిశగా వైకాపా దూసుకెళ్తోంది. తొలి గంటకే ఈ విషయం స్పష్టం అయిపోయింది.

 ఏపీలో తెలుగుదేశం విజయాన్ని ఎవరూ ఆపలేరంటూ చంద్రబాబు ఒక రోజు ముందు కూడా ఆత్మవిశ్వాసంతో ప్రకటన చేశారు కానీ.. ఫలితాలు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అమరావతిలోని చంద్రబాబు నివాసం వద్ద భారీ ఏర్పాట్లే చేశారు. పెద్ద ఎత్తున నాయకులు అక్కడికి చేరుకుని ఎన్నికల ఫలితాలు చూసేందుకు భారీ స్క్రీన్ల ముందు కూర్చున్నారు. ఫలితాలు వస్తుండగా అక్కడికి పెద్ద ఎత్తున జనం వస్తారని అందుకు తగ్గట్లుగా భారీగానే ఏర్పాట్లు చేశారు.

కానీ ఉదయం 10 గంటల సమయానికే చంద్రబాబు నివాసం వద్ద శ్మశాన వాతావరణం నెలకొంది. జనాల జాడే కనిపించలేదు. ఓటమి ఖరారైపోవడంతో జనం లేక వెలవెలబోయింది ఆ ప్రాంగణం. బాబు నివాసం ముందు ప్రతి అరగంటకూ ఓ ప్రెస్ మీట్ ఉంటుందని, ప్రధాన నాయకులు మీడియాతో మాట్లాడాతారని చెప్పారు. దీంతో పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు అక్కడ కాపు కాశారు.

కానీ ఉదయం తొలి అరగంట తర్వాత వర్ల రామయ్య వచ్చి ఒకసారి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన సహా ఎవరూ మీడియా ముందుకు రాలేదు. నాయకుల జాడే కనిపించలేదు. మీడియా ప్రతినిధులు పని లేక ఖాళీ అయిపోయారు. వైసీపీ గెలిచినా కూడా ఈ స్థాయిలో ఏక పక్షంగా గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థాయి పరాభవం అస్సలు ఊహించనిదే. మొత్తంగా 50 స్థానాలు గెలిచినా ఎక్కువే అనుకునే పరిస్థితి కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English