రిస్క్ అన్నారు.. లాభాల పంట పండింది

రిస్క్ అన్నారు.. లాభాల పంట పండింది

హార్రర్ కామెడీ జానర్ కొన్నేళ్ల కిందటే ఔట్ డేటెడ్ అయిపోయిన నేపథ్యంలో మళ్లీ ఈ జానర్లో ‘కాంఛన-3’ సినిమా వస్తుంటే ఇదేం ఆడుతుందిలే అని చాలామంది సందేహించారు. ‘కాంఛన’ సిరీస్‌లో అంతకుముందు వచ్చిన సినిమాలు ఎలా ఆడి ఉన్నప్పటికీ.. ఈసారి మాత్రం లారెన్స్‌కు బ్రేక్ పడటం ఖాయమనుకున్నారు. ఈ సినిమా మీద ఠాగూర్ మధు రూ.16 కోట్ల పెట్టుబడి పెట్టడం చూసి ఆశ్చర్యపోయిన చాలామంది రికవరీ చాలా కష్టమని తేల్చేశారు. ‘కాంఛన-3’కి వచ్చిన టాక్, రివ్యూల ప్రకారం చూస్తే మధుకు పెద్ద బ్యాండ్ తప్పదని అంచనా వేశారు. కానీ ఈ సినిమా అంచనాల్ని తలకిందులు చేసింది. టాక్‌తో, రివ్యూలతో సంబంధం లేకుండా బి, సి సెంటర్లలో దుమ్ము దులిపింది. ఓ పక్క అదిరిపోయే రివ్యూలు వచ్చిన ‘జెర్సీ’ సినిమా చిన్న సెంటర్లలో వెలవెలబోతుంటే.. మరోపక్క ‘కాంఛన-3’ హౌస్ ఫుల్స్‌తో రన్ అయ్యే పరిస్థితి.

సినిమా గురించి ఎవరేం కామెంట్ చేసినా సరే.. ‘కాంఛన-3’ వసూళ్లకు మాత్రం ఢోకా లేదు. వీకెండ్ తర్వాత కూడా అదరగొడుతూ సాగిపోతున్న ఈ చిత్రం ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసింది. తొలి వారంలో రూ.16 కోట్లకు పైనే షేర్ వచ్చింది. రెండో వారాంతంలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.25 కోట్ల షేర్ మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదు. ఠాగూర్ మధు చాలా ఏరియాల్లో సొంతంగా సినిమాను రిలీజ్ చేశారు. పర్సంటేజ్ బేసిస్ మీద రిలీజ్ చేసిన చోట్లా లాభాలు ఆయన ఖాతాలోకి చేరబోతున్నాయి. మొత్తంగా చూస్తే ‘కాంఛన-3’ విషయంలో రిస్క్ చేసి పెద్ద పెట్టుబడి పెట్టిన మధుకు ఈ సినిమా మంచి లాభాలే అందజేస్తోంది. సినిమా ఆడని పక్షంలో డబ్బులు తక్కువ కట్టే ఒప్పందంతోనే ఆయన సన్ పిక్చర్స్, లారెన్స్‌లతో మాట్లాడుకుని తెలుగులో సినిమాను రిలీజ్ చేసినట్లు సమాచారం. ఆ రకంగా చూస్తే ఆయన మరీ ఎక్కువ రిస్క్ ఏమీ తీసుకోలేదనే అనుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English