నీ మనసుకు తెలియదా దేవీ?

నీ మనసుకు తెలియదా దేవీ?

ఒకప్పుడు తమన్ లాంటి సంగీత దర్శకులే సోషల్ మీడియాలో జనాల టార్గెట్ అయ్యేవాళ్లు. వాళ్ల పాటలు కాపీ అనో.. రొటీన్ అనే విమర్శలొచ్చేవి. ఐతే మధ్యలో తమన్ తనను తాను సమీక్షించుకుని కొంచెం బిన్నమైన మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ‘తొలి ప్రేమ’, ‘మహానుభావుడు’ లాంటి సినిమాల్లో తమన్ ఎంత వైవిధ్యం చూపించాడో తెలిసిందే. ఇప్పుడు తమన్ మీద  చాలా వరకు ట్రోల్స్ తగ్గాయి.

కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో దేవిశ్రీ ప్రసాద్ ఎక్కువగా ట్రోల్స్‌కు కేంద్రంగా మారుతుండటం ఆశ్చర్యకరం. గత రెండు మూడేళ్లుగా దేవి సంగీతంలో పదును కనిపించడం లేదు. చాలా వరకు అతడి ఆడియోలు నిరాశ కలిగిస్తున్నాయి. ఒకప్పుడు దేవి సినిమాల ఆడియోల్లో బాగా లేని పాటంటూ ఉండేది కాదు. మొత్తం ఆడియో అంతా ది బెస్ట్ ఇవ్వడానికి చూసేవాడు. కానీ ఇప్పుడు అతడి ఆడియోలో ఏదైనా పాట బాగుంటే, కొత్తగా అనిపిస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి.

‘మహర్షి’ లాంటి భారీ ప్రాజెక్టుకు దేవిశ్రీ ఇచ్చిన పాటలు చూసి అందరూ విస్తుబోతున్నారు. ఇప్పటిదాకా రిలీజైన రెండు పాటల్లో ఏదీ అంత ప్రత్యేకంగా అనిపించలేదు. ఈ పాటల మీద సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రోల్స్ పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. దేవి మీద ఇలాంటి ట్రోల్స్ రావడం ఆశ్చర్యకరమే. ఆ మధ్య తమన్ తనపై వచ్చిన విమర్శల గురించి స్పందిస్తూ.. దేవిశ్రీని అయితే ఇలా అంటారా.. ట్రోల్ చేస్తారా అన్నాడు. కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. దేవి గతంలో ఎన్నడూ లేని విధంగా విమర్శలెదుర్కొంటున్నాడు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ‘మహర్షి’ కోసం దాదాపు రెండేళ్ల కిందటే దేవి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టాడు.

దర్శకుడు వంశీ పైడిపల్లి లొకేషన్ల వేట కోసం అమెరికాకు వెళ్తే అక్కడికి దేవిని వెంట తీసుకెళ్లాడు. వాళ్లిద్దరూ అప్పట్నుంచే సంగీత చర్చలు నడిపారు. అంత ముందుగా పని మొదలుపెడితే.. ఇలాంటి పాటలా ఇచ్చేది అంటూ జనాలు ఇప్పుడు దేవిని తిట్టిపోస్తున్నారు. ఐతే ఎక్కువగా నెగెటివ్ ట్వీట్సే పడుతుండగా.. దేవి మాత్రం తనను పొగిడిన ఒకటీ అరా ట్వీట్లకు లైక్ కొడుతూ, రీట్వీట్ చేస్తూ అంతా బాగుంది అన్న ఫీలింగ్ తేవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఎవరు ఏమంటారన్నది పక్కన పెడితే.. సరైన పాటలు ఇస్తున్నాడా లేదా అన్నది దేవికి తెలియకుండా ఉంటుందా? నిజాయితీగా అతను తనను తాను సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నది స్పష్టం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English