బాలీవుడ్ జనాల్లో టెన్షన్ టెన్షనే

బాలీవుడ్ జనాల్లో టెన్షన్ టెన్షనే

బాలీవుడ్‌కు 2018వ సంవత్సరం పెద్ద షాకులే ఇచ్చింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న భారీ చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఎన్నడూ లేని విధంగా ఆమిర్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. షారుఖ్ నటించిన మూడు సినిమాలూ ఒకే ఏడాది డిజాస్టర్లుగా నిలిచాయి. ముఖ్యంగా ఫ్లాప్ రుచి ఎలా ఉంటుందో మరిచిపోయిన ఆమిర్ ఖాన్ సైతం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ రూపంలో భారీ డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ‘సోనూ కీ టీటూ కే స్వీటీ’.. ‘అందాదున్’.. ‘బడాయి హో’ లాంటి చిన్న సినిమాలు సంచలన విజయాలు సాధించగా.. భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రాల్లో చాలా వరకు తేడా కొట్టేశాయి. తాజాగా ‘జీరో’తో బాలీవుడ్‌కు పెద్ద షాక్ తగిలింది. షారుఖ్ ఖాన్ కెరీర్లో ఇది మరో పెద్ద డిజాస్టర్ అయ్యే దిశగా సాగుతోంది. ఏడాదిని మంచి విజయాలతో ముగించాలనుకున్న బాలీవుడ్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు.

గత వారం ‘జీరో’తో షాక్ తిన్న బాలీవుడ్.. ఇప్పుడు ఏడాది చివర్లో రాబోయే ‘సింబా’ మీద ఆశలు పెట్టుకుంది. ఇది తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఐతే ‘టెంపర్’ చూసిన వాళ్లకు ఈ చిత్ర ట్రైలర్ చూడగానే షాక్ తగిలింది. మంచి కథను ఊర మాస్ స్టయిల్లో చెప్పే ప్రయత్నం చేసిన రోహిత్ శెట్టి తీవ్ర నిరాశకు గురి చేశాడు. కథలోని ఫ్లేవర్ మొత్తం మిస్సయింది. ‘టెంపర్’తో పోల్చకుండా చూసిన హిందీ జనాలు సైతం ట్రైలర్ విషయంలో అంత పాజిటివ్‌గా ఏమీ లేరు. ఈ సినిమా ఆడుతుందో లేదో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏడాది చివర్లో ఒక హిట్‌ వస్తే కొత్త ఏడాదిని సానుకూలంగా ఆరంభించడానికి అవకాశముంటుంది. అలా కాకుండా ఇది కూడా ఫ్లాప్ అయితే 2018 చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అని బాలీవుడ్ జనాల్లో టెన్షన్ నెలకొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English