సజ్జల మాటలకు అర్థముందా ?

ప్రజాప్రతినిధులు మరణిస్తే జరిగే ఉపఎన్నికల్లో వాళ్ళ కుటుంబసభ్యులనే పోటీలోకి దించే సంప్రదాయం వైసీపీలో ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అలాగే ఏ పార్టీ ప్రజా ప్రతినిధి మరణించినా జరిగే ఉపఎన్నికలో ఇతర పార్టీలు అభ్యర్ధిని దించకూడదనే సంప్రదాయాన్ని కూడా సజ్జల గుర్తుచేశారు. ఈ సంప్రదాయం ప్రకారం తొందరలో జరగబోయే బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో ప్రత్యర్ధిపార్టీలు అభ్యర్ధులకు పోటీకి దించకూడదని విజ్ఞప్తి చేశారు.

విజ్ఞప్తి చేయటంలో తప్పేమీ లేదు. కానీ సంప్రదాయం పేరుతో ఏది పడితే అది మాట్లాడటమే ఇబ్బందిగా మారింది. ప్రజాప్రతినిధులు చనిపోతే జరిగే ఉపఎన్నికల్లో వారి కుటుంబసభ్యులనే పోటీలోకి దించాలనే సంప్రదాయం ఉన్నది కరెక్టే. దాని ప్రకారం బద్వేలులో దివంగత ఎంఎల్ఏ వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధను వైసీపీ పోటీలోకి దింపుతోంది. ఇంతవరకు కరెక్టే కానీ మరి ఇదే సంప్రదాయం తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ఏమైంది ? అన్నదే ప్రశ్న.

తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రసాద్ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. సంప్రదాయం ప్రకారమైతే బల్లి కుటుంబసభ్యులకే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వాలి. కానీ కొత్త అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తిని జగన్ రంగంలోకి దించారు. పోటీకి ఆసక్తి చూపిన దివంగత ఎంపి బల్లి కుటుంబసభ్యులను కాదని కొత్త అభ్యర్ధిని జగన్ ఎందుకని రంగంలోకి దింపారు ? అనే ప్రశ్నకు సజ్జల సమాధానం చెప్పాలి. అంటే తాము పెట్టుకున్న సంప్రదాయాన్ని వైసీపీనే ఉల్లంఘించింది.

తన సాంప్రదాయాన్ని వైసీపీనే ఉల్లంఘించినపుడు ఇతర పార్టీలు ఎందుకని గౌరవిస్తాయి. ఒకప్పడు కృష్ణాజిల్లాలోని నందిగామ టీడీపీ ఎంఎల్ఏ తంగిరాల ప్రభాకర్ మరణించిన తర్వాత జరిగిన ఉపఎన్నికలో వైసీపీ పోటీ చేయలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం పోటీలో ఉంది. ఈ కారణంగానే అప్పట్లో ఉప ఎన్నిక జరిగింది. అప్పట్లో ప్రభాకర్ కూతురు సౌమ్యను ఫోటో చేయించిన కారణంగానే వైసీపీ పోటీ చేయలేదు. కానీ తిరుపతిలో ఆ సంప్రదాయాన్ని స్వయంగా వైసీపీనే ఉల్లంఘించింది.

తిరుపతిలో సంప్రదాయాన్ని ఎందుకు ఉల్లంఘించింది ? బద్వేలులో ఎందుకు పాటిస్తోందో తెలీదు. నిజానికి పోటీ చేయాలా ? వద్దా అనేది ఆయా పార్టీల ఇష్టం. ఈ విషయంలో సజ్జల ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తిగా పార్టీల ఇష్టమే. చనిపోయిన ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులనే పోటీ చేయించాలని కూడా ఏమీ లేదు. ఏదో సంప్రదాయం పేరుతో సాగినంత కాలం సాగింది తర్వాత బ్రేక్ పడింది. కాబట్టి సంప్రదాయం పేరుతో కాకుండా ఎవరి సత్తా వాళ్ళు చూపించటమే ఉత్తమం.