నిజ‌మేనా? కేసీఆర్ అలా చేశారా? బండి కామెంట్ల‌ సంచ‌ల‌నం

బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు, పొలిటిక‌ల్‌ ఫైర్ బ్రాండ్ బండి సంజ‌య్ చేసిన తాజా వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి. వాస్త‌వానికి అధికార పార్టీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంజ‌య్‌.. ప్ర‌స్తుతం ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కేసీఆర్ స‌ర్కారుపై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే.. సాధార‌ణ పొలిటిక‌ల్ విమ‌ర్శ‌ల‌కు భిన్నంగా తాజాగా ఆయ‌న చేసిన కొన్ని కామెంట్లు.. నిజంగానే కేసీఆర్ అలా చేశారా? అనే వ్యాఖ్య‌లు వినిపించేలా చేస్తున్నాయి.

ఇంతకీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌జా సంగ్రామ యాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లా జోగిపేట బహిరంగ సభలో మాట్లాడుతూ బండి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న కామెంట్లు కుమ్మ‌రించారు. తెలంగాణలో 2023లో అధికారంలోకి వస్తామని, కేసీఆర్‌ సంగతి తేలుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హెచ్చరించిన‌ట్టు చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఎప్పుడు ఎన్నిక వచ్చినా కేసీఆర్‌ ఢిల్లీ వెళతారని, అదే ఆనవాయితీగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్‌షాను కలిశారని బండి చెప్పారు.

అంతేకాదు, హైదరాబాద్‌ మేయర్‌ పదవిని బీజేపీకి ఇస్తామని కేసీఆర్‌.. అమిత్ షా ముందు ఒక ప్ర‌తిపాద‌న ఉంచిన విష‌యాన్ని బండి వెల్ల‌డించారు. అయితే అలాంటి పదవులు తమకు అక్కరలేదని అమిత్‌ షా తిరస్కరించారని చెప్పారు. మీరిస్తే తీసుకునేదేమీ లేదని కేసీఆర్‌తో షా కుండ‌బ‌ద్ద‌లు కొట్టార‌ని బండి వ్యాఖ్యానించారు. అంతేకాదు, 2023లో రాష్ట్రంలో మేమే అధికారంలోకి వ స్తాం.. మీ సంగతి తేలుస్తామ‌ని షా కేసీఆర్‌ను హెచ్చ‌రించార‌ని.. బండి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

బీజేపీకి టీఆర్ఎస్‌కు సంబంధం లేదని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని బండి వివ‌ర‌ణ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌లు అవమానించాయని సంజయ్‌ విమర్శించారు. ఎన్నికల్లో అంబేడ్కర్‌ను ఓడించిన పార్టీ కాంగ్రెస్‌ అని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్నడూ అంబేడ్కర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు రాలేదని చెప్పారు. రూ.వంద కోట్లతో ప్రగతి భవన్‌ కట్టుకున్న కేసీఆర్‌.. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం వెనుక కుట్ర ఉందని సంజయ్‌ ఆరోపించారు.

స‌రే.. ఇత‌ర ఆరోప‌ణ‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. మేయ‌ర్ ప‌ద‌విని కేసీఆర్‌.. బీజేపీకి ఇస్తామ‌ని చెప్ప‌డం.. దీనిని షా వ‌ద్ద‌ని తిర‌స్క‌రించ‌డం వంటి కామెంట్లు తాజాగా వెల్ల‌డించ‌డం.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఇది నిజ‌మే అయితే.. అప్ప‌ట్లోనే ఎందుకు బండి ఎందుకు బ‌య‌ట పెట్ట‌లేదు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అంతేకాదు.. కేసీఆర్ ఇటీవ‌ల జ‌రిపిన ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత‌.. బీజేపీతో కేసీఆర్‌కు లోపాయికారీ సంబంధాలు ఉన్నాయ‌ని.. స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్న స‌మ‌యంలోనే ఇప్పుడు బ‌య‌ట పెట్ట‌డం వంటివి బండి నైతిక‌త‌నే ప్ర‌శ్నార్థ‌కం చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీలకులు. ఏదేమైనా.. ప్ర‌స్తుతం ఈ విష‌యం తెలంగాణ‌లో సంచ‌ల‌నం రేపుతున్నద‌నడంలో సందేహం లేదు.