అడ్డాల సినిమా నిజ్జంగానే..

అడ్డాల సినిమా నిజ్జంగానే..

బ్రహ్మోత్సవం.. తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన చిత్రం. పెద్ద హీరోల సినిమాలు డిజాస్టర్లు కావడం కొత్తేమీ కాదు. కానీ ఈ చిత్రం హీరో, దర్శక నిర్మాతలకు అవమాన భారం మిగిల్చింది.

దీని మీద రిలీజ్ టైంలో ఎంత ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబు తన కెరీర్లోనే మరే సినిమాకూ లేని విమర్శలెదుర్కొన్నాడు. ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పరిస్థితైతే చెప్పాల్సిన పని లేదు. మహేష్‌ ఈ సినిమా పరాభవం నుంచి బయటపడి వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయాడు కానీ.. అడ్డాల పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైంది.

ఏడాది పాటు అతడికి మరో అవకాశమే దక్కలేదు. ఖాళీగా ఉండిపోయాడు. కొంత కాలం హైదరాబాద్ వదిలేసి సొంతూరికి వెళ్లిపోయి అక్కడే ఉండిపోయాడు. ఐతే ఎట్టకేలకు కొన్ని నెలల కిందట అల్లు అరవింద్ అతడితో సినిమా చేయడానికి అంగీకరించినట్లు వార్తలొచ్చాయి.

ఐతే ఈ సినిమా ఇదిగో అదిగో అంటున్నారే తప్ప కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై సందేహాలు ముసురుకున్నాయి. ఐతే ఎట్టకేలకు ఈ సందేహాలకు తెరపడింది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. దసరా రోజు ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారట. యువ కథానాయకుడు శర్వానంద్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు అడ్డాల.

శర్వా ఇందులో విద్యార్థి పాత్రలో కనిపిస్తాడని సమాచారం. నిజానికి తన చిన్న కొడుకు శిరీష్‌ కోసం అడ్డాలను అరవింద్ పిలిచాడని.. ఐతే ఇద్దరికీ మార్కెట్ లేని నేపథ్యంలో వాళ్ల కాంబినేషన్లో సినిమా అంటే వర్కవుట్ కాదని భావించి శర్వాతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశాడని అంటున్నారు. సినిమా బిజినెస్ విషయంలో పక్కాగా లెక్కలేసుకుని బడ్జెట్ పెట్టే అరవింద్.. అడ్డాల-శర్వా సినిమాను తక్కువ ఖర్చుతోనే చేయబోతున్నాడట.

కథ నచ్చడంతో ‘బ్రహ్మోత్సవం’ ఫలితాన్ని పట్టించుకోకుండా శర్వా ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఈసారి అడ్డాల ఎలాంటి సినిమాను డెలివర్ చేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English