ఫ్లాప్ సినిమాకు రీమేకా?

ఫ్లాప్ సినిమాకు రీమేకా?

సాధారణంగా ఒక భాషలో హిట్టయిన సినిమానే మరో భాషలోకి రీమేక్ చేస్తుంటారు. కొన్నిసార్లు మరీ పెద్ద హిట్ కాని యావరేజ్ మూవీస్ కూడా వేరే భాషలోకి వెళ్తుంటాయి. కానీ పూర్తిగా ఫ్లాప్ అయిపోయిన సినిమాల జోలికి ఎవ్వరూ వెళ్లరు. కానీ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో విజయ్ ఆంటోనీ మాత్రం తెలుగులో వచ్చింది వెళ్లింది కూడా తెలియని ‘నెపోలియన్’ అనే సినిమాను తమిళంలోకి రీమేక్ చేయడానికి సిద్ధమవడం విశేషం. ‘ప్రతినిధి’ సినిమాతో రచయితగా పేరు తెచ్చుకున్న ఆనంద్ రవి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో ఒక వ్యక్తి తన నీడ పోయిందంటూ పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. అక్కడి నుంచి అనూహ్య పరిణామాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో సాగే కథ ఇది.

కాన్సెప్ట్ భిన్నంగానే ఉంటుంది కానీ.. దాని ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవడంతో ‘నెపోలియన్’ ప్రేక్షకాదరణ పొందలేదు. సరైన స్టార్ కాస్ట్ లేకపోవడం కూడా చిత్రానికి మైనస్ అయింది. ఐతే భిన్నమైన కాన్సెప్ట్ కావడంతో దీన్ని తీసుకుని సరిగా తీర్చిదిద్దితే మంచి సినిమా అవుతుందని విజయ్ ఆంటోనీ భావిస్తున్నాడట. ఎప్పట్లాగే తన సొంత బేనర్లో ఈ చిత్రం చేయబోతున్నాడు ఆంటోనీ. ఈ చిత్రానికి దర్శకుడెవరన్నది ఇంకా ఖరారు కాలేదు. రీమేక్ హక్కులైతే విజయే తీసుకున్నాడు. ‘బిచ్చగాడు’ సినిమాతో తెచ్చుకున్న క్రేజ్ మొత్తం.. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో పోగొట్టుకున్నాడు విజయ్. చివరగా వచ్చిన ‘కాశి’ కూడా డిజాస్టరే అయింది. ప్రస్తుతం అతను ‘తిమురు పుడిచవన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తెలుగులోకి కూడా అనువాదం కానుంది. దీని తర్వాత ‘నెపోలియన్’ రీమేక్‌లో నటించబోతున్నాడు విజయ్. మరి అక్కడైనా ఈ చిత్రం మంచి ఫలితాన్నందుకుంటుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు