గీత గోవిందం రిలీజ్.. ఒక విచిత్రం

గీత గోవిందం రిలీజ్.. ఒక విచిత్రం

ఏ రోజైతే ‘గీత గోవిందం’ అనే టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారో.. ఆ రోజే ఈ చిత్రంపై ఒక పాజిటివ్ ఇంప్రెషన్ కలిగింది. ప్లెజెంట్‌గా ఉన్న టైటిల్, ఫస్ట్ లుక్ సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలన్నీ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ పాట సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీజర్ సైతం అంచనాల్ని పెంచింది. ఈ సినిమాకు ఎలాంటి హైప్ ఉందన్నది అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే అర్థమవుతోంది. మరీ ఇంత హైప్ ఉంటుందని చిత్ర బృందం కూడా ఊహించి ఉండదేమో. ఈ క్రమంలో అందరూ ఒక ముఖ్యమైన విషయాన్ని మరిచిపోయారు. అదేంటంటే.. ‘గీత గోవిందం’కు థియేట్రికల్ ట్రైలరే విడుదల చేయలేదు.

ఈ చిత్ర టీజర్ నెల రోజుల కిందటే రిలీజైంది. ఐతే ట్రైలర్‌ను మామూలుగా విడుదలకు వారం పది రోజుల ముందు రిలీజ్ చేస్తారు. ముందుగా ఈ చిత్రానికి ఆడియో వేడుక చేయడంతో ఆ రోజే ట్రైలర్ వస్తుందనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రి రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు కాబట్టి ఆ రోజు ట్రైలర్ వస్తుందనుకున్నారు. కానీ ఆ రోజు కూడా అది రాలేదు. చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేయలేదో ఎవరికీ అర్థం కాలేదు. చాలామంది ఈ సంగతే మరిచిపోయారు. ఐతే నిజానికి ఈ చిత్రానికి ట్రైలర్ వదలాలనే అనుకున్నారట. కానీ ఈ చిత్రం పైరసీ బారిన పడటంతో కొన్ని రోజులుగా చిత్ర బృందమంతా ఆ పనిలోనే తలమునకలైంది. అందరూ డిస్టర్బ్ అయ్యారు. దీంతో ట్రైలర్ మీద దృష్టిపెట్టడానికి అవకాశం లేకపోయింది. సినిమాకు ఎలాగూ హైప్ కూడా వచ్చింది కాబట్టి ఇక ట్రైలర్ ఎందుకులే అని ఆ ఆలోచనను పక్కన పెట్టేసినట్లు సమాచారం. కాస్త పేరున్న సినిమా ఇలా ట్రైలరే లేకుండా రిలీజ్ కావడం అరుదే. ఇంతకుముందు ‘కబాలి’ విషయంలోనూ ఇలాగే జరిగింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు