విశ్వరూపం-2.. బొమ్మ పడేవరకు డౌటే

విశ్వరూపం-2.. బొమ్మ పడేవరకు డౌటే

మామూలుగా కమల్ హాసన్ సినిమా రిలీజవుతుంటే ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. విడుదలకు ఏదో ఒక అడ్డంకి ఎదురవ్వాల్సిందే. ‘విశ్వరూపం-2’ విషయంలోనూ అదే జరుగుతోంది. నాలుగేళ్ల ముందు రావాల్సిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు ఎలాగోలా పూర్తి చేసి కమల్ విడుదలకు సిద్ధం చేస్తే.. దీని విడుదల ఆపాలంటూ ఒక సంస్థ ఇటీవలే కోర్టుకెక్కింది. దాన్ని ఆఫ్ ద కోర్టు ఎలాగోలా సెటిల్ చేసుకున్నట్లే ఉన్నాడు కమల్. కానీ ఇంతలో కరుణానిధి మరణం కమల్ సినిమాకు ఇబ్బందిగా మారింది. సినిమా విడుదలకు ఇంకో రెండు రోజులే సమయం ఉండగా.. కరుణానిధి మరణించడంతో తమిళనాట విషాదం నెలకొంది. ఈ స్థితిలో ఎవ్వరూ సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కరుణది హఠాన్మరణమేమీ కాదు. ఆయన వయసిప్పుడు 94 ఏళ్లు. ఆయన చనిపోవడం ఖాయమని కొన్ని రోజుల కిందటే తేలిపోయింది.

అయినప్పటికీ ఒక గొప్ప నేత మరణించాక పరిస్థితి మారిపోతుంది. జనాల్లో ఎక్కడ లేని ఉద్వేగం వస్తుంది. విషాదంలో మునిగిపోతారు. ఇప్పుడు తమిళ జనాల పరిస్థితి కూడా అంతే. కరుణపై జనాల్లో గూడుకట్టుకున్న అభిమానం అంతా ఇప్పుడు పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం ఏడు రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలు కూడా ప్రకటించింది. ఈ స్థితిలో కమల్ తన సినిమాను ప్రమోట్ చేసుకునే స్థితిలో లేడు. అసలు జనాలు ‘విశ్వరూపం-2’ సహా ఏ సినిమా గురించీ మాట్లాడే పరిస్థితీ లేదు. అసలు ఈ స్థితిలో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూసే మూడ్‌లో ఉంటారా అన్నదీ సందేహమే. అసలే చాన్నాళ్లు వాయిదా పడ్డ సినిమా కావడంతో ‘విశ్వరూపం-2’కు బజ్ తక్కువగా ఉంది. దీనికి తోడు కరుణ తాలూకు విషాదం సినిమాకు ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో సినిమాను వాయిదా వేద్దామన్న ఆలోచన కూడా కమల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ మీడియా ఈ మేరకు ఊహాగానాలు చేస్తోంది కూడా. కాబట్టి శుక్రవారం ఉదయం బొమ్మ పడే వరకు డౌటే. బహుశా గురువారం ఈ విషయంలో ఏదో ఒక క్లారిటీ రావచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు