నయన్ ఏం చేసినా సంబరాలే సంబరాలు

నయన్ ఏం చేసినా సంబరాలే సంబరాలు

ఇష్టమైన వాళ్లు.. ప్రేమించే వాళ్లు చిన్న పనిచేసినా గొప్పదిగానే అనిపిస్తుంది. అదే నిజంగా గొప్ప పనిచేస్తే... పట్టపగ్గాలుండవు కదా! సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్ నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఫీలింగ్ ఇలాగే ఉంది. చాలాకాలంలో నయన్ ప్రేమలో మునిగితేలుతున్న ఈ డైరెక్టర్ నయనతారను పొగిడే ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. తన అభిమానాన్ని దాచుకునే ప్రయత్నమూ చేయలేదు.

తాజాగా నయనతార తమిళంలో కొలమావు కోకిల అనే సినిమా చేస్తోంది. ఇందులో స్మగ్లింగ్ చేస్తూ జీవనం సాగించే కుటుంబంలోని అమ్మాయిగా నయన్ నటించింది. బ్లాక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నీల్సన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో పాటలన్నింటనీ విఘ్నేష్ శివనే రాశాడు. కొలమావు కోకిల ట్రయిలర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో విఘ్నేష్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. దాంతో మరోసారి ట్విట్టర్ వేదికగా తన మనసులోని ప్రేమనంతా కుమ్మరించేశాడు.

‘‘నయనతార.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. కొత్తవారిలో ఉన్న ప్రతిభపై నీకున్న నమ్మకం.. నీ అంకిత భావం.. కొత్తదనం నిండి స్క్రిప్టులతో వస్తున్న సినిమాల్లో నిన్ను చూస్తుంటే చాలా ఇన్ స్పైరింగ్ గా ఉంది. నీ హావభావాలకు తగినట్టుగా పాటలు రాయడం చాలా ఆనందంగా ఉంది’’ అంటూ నయన్ పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. కొలమావు కోకిల సినిమా ఈనెల మూడోవారంలో థియేటర్లకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు