ఇంటర్వెల్‌ సీన్‌తో మెగా ఫాన్స్‌ పూనకాలే

ఇంటర్వెల్‌ సీన్‌తో మెగా ఫాన్స్‌ పూనకాలే

రామ్‌ చరణ్‌ మలి చిత్రం సంక్రాంతికి ఖరారైంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు. రంగస్థలం తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. రంగస్థలంలో చాలా వెరైటీ చూపించిన రామ్‌ చరణ్‌ మళ్లీ మాస్‌ మంత్రం జపిస్తున్నాడా అనే దానిపై స్పష్టత లేదు కానీ బోయపాటి శ్రీను మాత్రం తన ముద్ర తెలిసేట్టు వ్యవహరిస్తున్నాడు.

ఈ చిత్రంలో ఇంటర్వెల్‌ సీన్‌కి ఫాన్స్‌కి పూనకాలు వచ్చేస్తాయని అంటున్నారు. భారీ యాక్షన్‌ సీన్‌ కోసం అయిదు కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. ఒక ఫైట్‌ సీన్‌కే ఇంత ఖర్చు అంటే సినిమాలో అది ఎంత కీలకమైన ఎపిసోడ్‌ అనేది అర్థం చేసుకోవచ్చు. రంగస్థలంలో విలేజ్‌ సెట్‌కే అంత ఖర్చు పెట్టారు. ఎన్నో రోజులు షూటింగ్‌ చేసిన లొకేషన్‌ కోసం పెట్టిన ఖర్చుని పది నిమిషాల నిడివి వుంటే ఫైట్‌ సీన్‌ కోసం పెట్టేస్తున్నారు.

భారీ సంఖ్యలో ఫైటర్లు, బాడీ బిల్డర్లని ఈ ఫైట్‌ కోసం ఎంపిక చేసారు. రామ్‌ చరణ్‌ ఈ చిత్రం కోసం మరోసారి బాడీ పెంచుతున్నాడు. ధృవ చిత్రంలో అథ్లెటిక్‌ బాడీతో కనిపించిన చరణ్‌ ఈసారి భారీ సైజ్‌ కండలతో కనిపిస్తాడు. బోయపాటితో రెగ్యులర్‌ సినిమా చేయడం లేదని చరణ్‌ చెబుతున్నా కానీ ఈ చిత్రం గురించి వస్తోన్న ఏ వార్త చూసినా బోయపాటి మార్కు మాస్‌ మసాలా సినిమానే అనిపిస్తోంది. ఇంతవరకు జానర్‌ ఏమిటనేది తెలియని ఈ చిత్రం అభిమానులని అంతకంతకీ ఎక్సయిట్‌ చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు