ఆంజనేయుడితో విశ్వంభర కనెక్షన్

బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర ఇంటర్వెల్ బ్లాక్ ని 26 రోజుల సుదీర్ఘమైన షెడ్యూల్ లో పూర్తి చేశారు. ఫైటర్లతో భారీ ఎత్తున జరిగే ఈ యాక్షన్ సీక్వెన్స్ ని రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో తీశారు. చిరంజీవి కెరీర్ లోనే భారీ విశ్రాంతి ఎపిసోడ్ ఇదేనని టాక్. ఈ మధ్యకాలంలో మెగాస్టార్ ని ఎవరు కలవాలన్నా నేరుగా అక్కడికే వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ కి అయిదు కోట్ల విరాళంతో మొదలుపెట్టి కార్తికేయ టీజర్ రిలీజ్ దాకా అన్నీ అక్కడే జరిగిపోయాయి. 54 అడుగుల హనుమంతుడి విగ్రహం చుట్టూ కీలకమైన ఈ ట్రాక్ ని వశిష్ట పవర్ ఫుల్ గా తెరకెక్కించారని సమాచారం.

ఇక అసలు విషయానికి వస్తే విశ్వంభరలో కేంద్ర బిందువుగా నిలిచే ఈ పోరాటంలో ఆంజనేయుడికి చాలా బలమైన కనెక్షన్ ఉంటుందట. అప్పటిదాకా సామాన్యుడిగా ఉన్న భీమవరం దొరబాబు ఒక్కసారిగా విశ్వరూపం దాల్చి దాడి చేసిన రౌడీ మూకల అంతు చూసే సీన్ లో కేవలం ఫైట్లు మాత్రమే బలమైన డివోషనల్ ఎలివేషన్ పెట్టారట. జగదేకవీరుడు అతిలోకసుందరిలో హనుమంతుడి గెటప్ లో చిరంజీవి విగ్రహం దొంగతనానికి వచ్చిన గూండాల తుక్కు రేపుతాడు. అదే తరహాలో విశ్వంభరలో వందలాది ఆయుధాలను చిరు కాచుకునే సీన్ లో థియేటర్లు మోతెక్కిపోవడం ఖాయమట.

వచ్చే ఏడాది జనవరి 10 విడుదల కాబోతున్న విశ్వంభర ఇప్పటిదాకా పక్కా ప్లానింగ్ తో ఎలాంటి విఘ్నలు లేకుండా జరుగుతోంది. ఆగస్ట్ లోపు పూర్తి చేసి అయిదు నెలలు పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ కే కేటాయించబోతున్నారు. కీరవాణి స్వరపరిచిన పాటల్లో ఆల్రెడీ రెండు షూట్ చేశారు. త్రిషతో డ్యూయెట్లను ఎక్కడ తీయాలనే డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. అయిదుగురు అక్కచెల్లెళ్ళకు బాధ్యతగా ఉన్న అన్నయ్య ముల్లోకాలు ఎందుకు తిరగాల్సి వచ్చిందనే పాయింట్ చుట్టూ విశ్వంభర ఉంటుందట. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తో రిలీజవుతున్న మెగా మూవీ ఇది.