‘భరత్’ హిందీ డీల్... నమ్మొచ్చా?

‘భరత్’ హిందీ డీల్... నమ్మొచ్చా?

వేరే భాషల సినిమాలు తెలుగులోకి డబ్ అయి ఇక్కడ వసూళ్ల మోత మోగించడమే తప్ప.. మన సినిమాలు అనువాదమై వేరే చోట్ల ప్రభావం చూపించడం అరుదుగా ఉండేది ఒకప్పుడు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. తెలుగు సినిమాల డబ్బింగ్ వెర్షన్లు వేరే భాషల్లో బాగానే ప్రభావం చూపిస్తున్నాయి. థియేటర్లలో కంటే కూడా యూట్యూబ్‌ల్లో, అక్కడి టీవీ ఛానెళ్లలో తెలుగు డబ్బింగ్ సినిమాలు ఇరగాడేస్తున్నాయి. ఉత్తరాదిన మన మాస్ సినిమాలకు ఊహించని స్థాయిలో ఆదరణ ఉంటోంది. ఈ నేపథ్యంలో కాస్త పేరున్న ప్రతి సినిమాకూ హిందీ డబ్బింగ్ హక్కులు మంచి రేటు పలుకుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు రూ.10 కోట్లకు పైగా హక్కులు పలికే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ హిందీ హక్కులకు ఊహించని రేటు పలికినట్లు వార్తలొస్తున్నాయి. ఆ మొత్తం రూ.22 కోట్లని అంటున్నారు. మహేష్ బాబుకు ఉత్తరాదిన ఫాలోయింగ్ బాగానే ఉంది. అయితే అతడి సినిమాకు మరీ రూ.22 కోట్ల రేటంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఇది నిజమైతే ‘బాహుబలి’ తర్వాత డబ్బింగ్ హక్కులకు అత్యధిక ధర దక్కించుకున్న తెలుగు సినిమాగా ‘భరత్ అనే నేను’ రికార్డు నెలకొల్పుతుంది. మరి ఈ డీల్‌లో వాస్తవమెంతో చూడాలి. ఈ మధ్య నిర్మాతలే ఇలా లీకులిచ్చి తమ సినిమాకు హైప్ పెంచుకుంటున్న నేపథ్యంలో మహేష్ సినిమా గురించి అసలు వాస్తవమేంటో? మరోవైపు ‘భరత్ అనే నేను’ తమిళం.. హిందీ వెర్షన్లు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు