సామి స్క్వేర్.. ఇంత అతేంటి బాబోయ్

సామి స్క్వేర్.. ఇంత అతేంటి బాబోయ్

తమిళ దర్శకుడు హరి సినిమాలు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘సింగం’ సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాలతో మనవాళ్లకు హరి స్టైల్ ఏంటో బాగానే అర్థమైంది. ఓవర్ ద బోర్డ్ హీరోయిజానికి అతడి సినిమాలు పెట్టింది పేరు. హీరోను మనిషిలాగా కాకుండా ఒక పులిలా.. సింహంలా చూపిస్తుంటాడతను. డైలాగులు కానీ.. ఫైటింగులు కానీ.. ఛేజింగులు కానీ చాలా అతిగా అనిపిస్తుంటాయి హరి సినిమాల్లో.

ముఖ్యంగా అతను తీసే పోలీస్ సినిమాల రూటే వేరుగా ఉంటుంది. అవి ఫాస్ట్ ఫార్వర్డ్‌లో నడుస్తున్నట్లుగా ఉంటాయి. ఐతే మళ్లీ మళ్లీ ఇదే స్టయిల్లో సినిమాలు తీయడంతో జనాలకు మొహం మొత్తేసింది. ‘సింగం-3’ సరిగా ఆడలేదు. అయినప్పటికీ హరి రూటేం మార్చుకోలేదు. తను 14 ఏళ్ల కిందట తీసిన పోలీస్ సినిమా ‘సామి’కి సీక్వెల్ తో రెడీ అయ్యాడు.

ఈ చిత్రానికి ‘సామి స్క్వేర్’ అని టైటిల్ పెట్టడమే అతి. దానికి తగ్గట్లే ట్రైలర్ కూడా తయారైంది. ఓపెనింగ్ షాట్ నుంచి ప్రతిదీ ఇందులో అతిగానే ఉంది. విక్రమ్‌ను చూపించిన విధానం.. స్పెషల్ ఎఫెక్టులు.. అతడి డైలాగులు.. అన్నీ ఓవర్ ద బోర్డే. మాస్ ప్రేక్షకుల్ని అలరించడమే లక్ష్యంగా సినిమా చేసినట్లున్నాడు. ట్రైలర్ అంతా భారీతనం కనిపిస్తోంది కానీ.. మొత్తం అంతా గోల గోలగా కూడా కనిపిస్తోంది. సటిల్ యాక్షన్‌కు పెట్టింది పేరైన విక్రమ్‌తో చాలా అతి చేయించినట్లున్నాడు హరి.

విలన్ బాబీ సింహా కూడా అంతే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. హీరోయిన్‌తో కూడా సున్నితమైన సీన్లేమీ ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ఇదే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే తెలుగు ట్రైలర్ లాంచ్ అవుతుంది. వచ్చే నెలలోనే ‘సామి స్క్వేర్’ ప్రేక్షకుల ముందుకొస్తుంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు