‘అజ్ఞాతవాసి’ ఎందుకు పోయిందో చెప్పాడు

‘అజ్ఞాతవాసి’ ఎందుకు పోయిందో చెప్పాడు

ఒక జల్సా.. ఒక అత్తారింటికి దారేది.. ఇలాంటి సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేసిన సినిమా ‘అజ్ఞాతవాసి’. దీనిపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భారీ వసూళ్లు సాధిస్తుందని.. నాన్-బాహుబలి రికార్డుల్ని అలవోకగా కొట్టేస్తుందని ఏవేవో అంచనాలు పెట్టుకున్నారు జనాలు ఈ సినిమాపై. కానీ ఊహించని విధంగా ఈ చిత్రం దారుణ ఫలితాన్నందుకుంది. త్రివిక్రమ్ కెరీర్లోనే చెత్త సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాను నమ్ముకున్న వాళ్లను నిలువునా ముంచేసింది. కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌తో పవన్ సినిమాల నుంచి నిష్క్రమించేలా చేసింది. ఈ ఫెయిల్యూర్ గురించి చిత్ర బృందంలో ఎవ్వరూ ఇప్పటిదాకా స్పందించలేదు. ఈ పరాజయానికి కారణాలేంటో చెప్పలేదు.

ఐతే ఎట్టకేలకు త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ ఎందుకో పోయిందో తన అభిప్రాయం చెప్పాడు. ఈ సినిమా విషయంలో చాలా తప్పులు జరిగాయని త్రివిక్రమ్ అన్నాడు. ముఖ్యంగా సినిమాలో ఎమోషన్ దూరమైందన్నాడు. ఒక రాజు.. ఓ రాజ్యం అంటూ అందరికీ తెలిసిన కథ చెబితే జనాలు లీనమయ్యేవారని.. కానీ ముఖేష్ అంబానీ అతడి ఇద్దరు కొడుకులు అంటూ కార్పొరేట్ కథను చెప్పానని.. అది జనాల సమస్య కాదని.. బిజినెస్ పేజీకి పరిమితం అయ్యే న్యూస్ ఐటెం లాంటిదని.. అందుకే జనాలు కనెక్టవ్వలేదని త్రివిక్రమ్ చెప్పాడు. ఇక ‘అజ్ఞాతవాసి’ తనపై ప్రభావం చూపించలేదంటే తాను అబద్ధమాడినట్లే అని.. తప్పకుండా ఆ ప్రభావం ఉందని త్రివిక్రమ్ స్పష్టం చేశాడు.

ఐతే ‘అజ్ఞాతవాసి’లో విషయం లేదని ఒప్పుకుంటూనే తన సినిమాల్లో ఇంతకుముందు పెద్ద ఫెయిల్యూర్‌గా నిలిచిన ‘ఖలేజా’ను తర్వాత జనాలు టీవీల్లో చూసి బాగుందన్నారని.. అలాగే ‘అజ్ఞాతవాసి’ కూడా తర్వాతేమైనా జనాలకు నచ్చుతుందేమో చూడాలని త్రివిక్రమ్ చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English