తెలుగులో మాధవన్ మరో సినిమా

తెలుగులో మాధవన్ మరో సినిమా

దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాల్లో కొనసాగుతున్నాడు తమిళ కథానాయకుడు మాధవన్. ‘చెలి’ మొదలుకుని అనేక డబ్బింగ్ సినిమాల ద్వారా అతను తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. హిందీలో డైరెక్ట్ సినిమాలు చాలానే చేశాడు. కానీ తెలుగులో మాత్రం అతను నేరుగా సినిమా చేయడానికి చాలా కాలం పట్టింది. భాష రాని చోట నటించలేనంటూ గిరి గీసుకుని కూర్చుని ఉండిపోయిన అతడిని చందూ మొండేటి మెప్పించాడు. ‘సవ్యసాచి’ సినిమాకు ఒప్పించాడు. ఈ చిత్రంలో మాధవన్‌ది నెగెటివ్ రోల్ అని.. అది చాలా వైవిధ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకు పని చేసిన అనుభవం గురించి ఆ మధ్య సోషల్ మీడియాలో చాలా పాజిటివ్‌గా చెప్పాడు మాధవన్. ‘సవ్యసాచి’కి పని చేశాక తెలుగు సినిమాల విషయంలో మాధవన్ ఆలోచన కూడా మార్చినట్లుంది.

తెలుగులోనే మరో సినిమా చేయడానికి మాధవన్ రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంతకుముందు మంచు విష్ణు హీరోగా ‘వస్తాడు నా రాజు’ అనే సినిమా తీసిన హేమంత్ మధుకర్ తీయబోయే కొత్త సినిమాలో మాధవన్ నటిస్తాడట. ఇదొక థ్రిల్లర్ మూవీ అని సమాచారం. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి తెరకెక్కుతుందట. ‘వస్తాడు నా రాజు’ డిజాస్టర్ కావడంతో హేమంత్ అడ్రస్ లేకుండా పోయాడు. మళ్లీ ఇన్నేళ్లకు ఒక కథ రెడీ చేసుకుని మాధవన్ లాంటి బహుభాషా నటుడిని మెప్పించడమంటే విశేషమే. ఈ చిత్రంలో మాధవన్ సరసన ఒక ప్రముఖ హీరోయిన్ నటిస్తుందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రానుంది. తమిళంలో గత రెండేళ్లలో ‘ఇరుదు సుట్రు’.. ‘విక్రమ్ వేద’ లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించిన మాధవన్.. ఇటీవలే తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు