కృష్ణతో అంత పెద్ద గొడవ జరిగిందట

కృష్ణతో అంత పెద్ద గొడవ జరిగిందట

సూపర్ స్టార్ కృష్ణను టాలీవుడ్లో అజాత శత్రువుగా చెబుతారు. అందరితో చాలా స్నేహంగా ఉంటూ.. కష్టాల్లో ఉన్న దర్శక నిర్మాతల్ని ఆదుకుంటూ.. ఇంకా ఎంతోమందికి సాయం చేస్తూ చాలా గొప్ప పేరే సంపాదించాడాయన. ఇండస్ట్రీలో ఆయన్ని వ్యతిరేకించే వాళ్లు చాలా తక్కువ. ఆయన చాలా వరకు వివాదాలకు దూరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తితో సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కయ్యం పెట్టుకున్నాడట. వాళ్ల మధ్య తీవ్ర విభేదాలు నెలకొని మూణ్నాలుగేళ్ల పాటు మాట్లాడుకోని పరిస్థితి తలెత్తిందట. ఈ గొడవ గురించి ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ్మారెడ్డి వివరాలు చెప్పాడు.

కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘పచ్చని సంసారం’ తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పట్లో మంచి హిట్టయింది కూడా. ఐతే ఈ చిత్రంలో బాబూ మోహన్-సిల్క్ స్మిత మీద ఒక పాట తీశారట. ఆ పాటలో కృష్ణ ఏమీ చేయకుండా సైలెంటుగా ఉండాలట. బాబూ మోహన్-సిల్క్ స్మిత మాత్రమే డ్యాన్స్ చేయాలట. కానీ కృష్ణ తాను సైలెంటుగా ఉంటే ఎవరు చూస్తారని.. తాను కూడా డ్యాన్స్ చేయాల్సిందే అని పట్టుబట్టాడట. అందుకు తమ్మారెడ్డి ఒప్పుకోలేదట. కమెడియన్‌తో కలిసి మీరు డ్యాన్స్ చేయడమేంటి అన్నారట. ఐతే కృష్ణ పట్టుబట్టడంతో ఆయన కృష్ణ డ్యాన్స్ చేసే వెర్షన్ ఒకటి.. ఆయనకు తెలియకుండా కేవలం బాబూ మోహన్-సిల్క్ స్మిత మాత్రమే డ్యాన్స్ చేసే వెర్షన్ మరొకటి తీసుకోమని నిర్మాత.. డ్యాన్స్ మాస్టర్‌లకు చెప్పేసి చెన్నై వెళ్లిపోయాడట.

తర్వాత ఎడిటింగ్‌లో కృష్ణ ఉన్నది తీసేసి బాబూ మోహన్-సిల్క్ స్మిత ఉన్నదే సినిమాలో పెట్టారట. ఐతే సెన్సార్ టైంలో కృష్ణ అనుకోకుండా ఇది చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడట. తమ్మారెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చి నీకు నాకు ఫ్రెండ్షిప్ కట్ అని చెప్పి వెళ్లిపోయాడట. ఈ వివాదానికి సంబంధించి కృష్ణ అభిమానులు తమ్మారెడ్డి ఇంటి మీద దాడి చేయగా.. ఆయన కేసులు పెట్టి కొందరిని జైల్లో కూడా పెట్టించాడట. మూణ్నాలుగేళ్ల వరకు తమ మధ్య మాటలు లేవని.. చివరికి అనుకోకుండా ఒక కార్యక్రమంలో కలిసి తామిద్దరం మాట్లాడుకున్నామని.. తన అభిమానుల మీద కేసులు ఎత్తేయమని కృష్ణ చెప్పడంతో వాటిని వెనక్కి తీసుకున్నానని తమ్మారెడ్డి వెల్లడించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు