రిలీజ్ డే: ముగ్గురి కెరీర్లకు పరీక్ష

రిలీజ్ డే: ముగ్గురి కెరీర్లకు పరీక్ష

మళ్లీ శుక్రవారం వచ్చేసింది. ఇంకో కొత్త సినిమా విడుదలకు సిద్ధమైపోయింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తనయుడు పూరి ఆకాశ్ హీరోగా పరిచయమవుతున్న ‘మెహబూబా’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొస్తోంది. పూరి కెరీర్లో ఇప్పటికే చాలా పరీక్షలు ఎదుర్కొన్నాడు. ఇది ఆయనకు అతి పెద్ద పరీక్షగా చెప్పొచ్చు.

గత దశాబ్ద కాలంలో తన స్థాయికి తగని సినిమాలతో పూరి తన అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఆఖరికి కెరీర్ బాగా స్లంప్‌లో ఉన్న సమయంలో నందమూరి బాలకృష్ణ లాంటి పెద్ద హీరో అవకాశమిస్తే దాన్నీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తన సినిమాల్ని తానే కాపీ కొడుతూ పూర్తిగా ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయాడు. ఇలాంటి స్థితిలో తన కొడుకును సొంత బేనర్లో పరిచయం చేసే సాహసానికి పూనుకున్నాడు.

‘మెహబూబా’పై ముందు అంచనాల్లేకపోయినా.. టీజర్, ట్రైలర్ ఆసక్తి రేకెత్తించాయి. దిల్ రాజు ఈ ప్రాజెక్టులోకి రావడంతో అంచనాలు పెరిగాయి. పూరి గత సినిమాల స్థాయిలో మాత్రం ఇది ఉండకపోవచ్చనే నమ్మకమైతే జనాల్లో కలిగింది. మరి దిల్ రాజు అన్నట్లు పూరి నిజంగానే కమ్ బ్యాక్ అవుతాడా లేదా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇక బాల నటుడిగా సత్తా చాటుకున్న పూరి ఆకాశ్.. పూర్తి స్థాయి హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఈ సినిమాలో హీరోలా కాకుండా ఒక పాత్రలాగే ఆకాశ్‌ను చూపించినట్లు కనిపిస్తోంది. మరి ఈ పాత్రలో అతనెలా మెప్పించాడో చూడాలి. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆకాశ్ పెర్ఫామెన్స్‌కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నదీ కీలకమే.

ఇదే సినిమాతో నేహా శర్మ అనే కొత్త హీరోయిన్ కూడా పరిచయమవుతోంది. ఆమె తన టాలెంట్ ఏంటో చూడాలి. తెలుగులో హీరోయిన్లు తొలి సినిమాతో హిట్ కొట్టకుంటే మనుగడ కష్టం. కాబట్టి ఆమెకూ ఈ సినిమా పరీక్షే. మరి ఈ ముగ్గురికీ ‘మెహబూబా’ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు