మరీ ఆ రేంజిలో పొగడాలా పవన్?

మరీ ఆ రేంజిలో పొగడాలా పవన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మామూలుగా తన సినిమాల్నే తాను పొగుడుకోడు. అలాగే తన కుటుంబ సభ్యుల సినిమాలను కూడా గతంలో ఎన్నడూ పెద్దగా పొగిడింది లేదు. కానీ ‘రంగస్థలం’ విషయంలో మాత్రం పవన్ పొగడ్తలు విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తెలుగు సినీ చరిత్రలోనే ఇంతకంటే గొప్ప సినిమా లేదన్నట్లుగా ఉన్నాయి పవన్ వ్యాఖ్యలు. ‘బాహుబలి’ గురించి కూడా ఎప్పుడూ పెద్దగా మాట్లాడని పవన్.. ‘రంగస్థలం’ను మాత్రం ఇలా ఆకాశానికెత్తేయడం విడ్డూరంగానే అనిపిస్తోంది జనాలకు. ‘రంగస్థలం’ మంచి సినిమానే. సందేహం లేదు. కానీ ఏకంగా ఆస్కార్ అవార్డుకు పంపించే రేంజి సినిమా ఇది అంటే మాత్రం విడ్డూరంగా అనిపించకమానదు.

ఐఎండీబీ సంస్థ కొన్ని హాలీవుడ్ సినిమాల కంటే కూడా ‘రంగస్థలం’కు ఎక్కువ రేటింగ్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు పవన్. కానీ ఐఎండీబీ సంస్థ తనే సొంతంగా సినిమాలకు ఏమీ రేటింగ్ ఇవ్వదు. రిజిస్టర్డ్ ఓటర్ల అభిప్రాయాల మేరకే అక్కడ సినిమాలకు రేటింగ్ వస్తుంది. ఈ విషయం తెలియకుండా ఐఎండీబీ రేటింగ్ గురించి అవగాహన రాహిత్యంతో వ్యాఖ్యలు చేశాడు పవన్. ఇక పవన్.. చరణ్ ను పొగిడిన తీరు కూడా ఆశ్చర్యపరిచేదే. ‘రంగస్థలం’లో చరణ్ బాగా చేశాడు. కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు కరెక్టే. కానీ అతను మామూలోడు కాదని.. పరిపూర్ణ నటుడని ట్యాగ్ లైన్ ఇచ్చేయడం కూడా కొంచెం అతిగానే అనిపిస్తుంది. ఈ సినిమా ముందు వరకు చరణ్ కు నటుడిగా ఉన్న గుర్తింపు ఏంటో అందరికీ తెలిసిందే. పవన్ తన కుటుంబ సభ్యుడి గురించి.. అతడి సినిమా గురించి ఈ రేంజిలో పొగడాల్సింది కాదేమో అన్నది జనాల అభిప్రాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు