హీరోయిన్ల మీద అంత ద్వేషమేంటి త్రివిక్రమ్?

హీరోయిన్ల మీద అంత ద్వేషమేంటి త్రివిక్రమ్?

ప్రతి దర్శకుడికీ ఒక సిగ్నేచర్ స్టయిల్ ఉంటుంది. ప్రధాన పాత్రల విషయంలో ఒక శైలిని అనుసరిస్తుంటారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయానికి వస్తే.. ఎందుకో ఏంటో కానీ ఆయనకు హీరోయిన్ పాత్రల మీద ఒక చులకన భావం ఉన్నట్లుగా అనిపిస్తుంద. కేవలం వినోదం కోసమే ఇలా చేస్తాడో లేక అమ్మాయిలపై తక్కువ అభిప్రాయమో కానీ.. ఆయన సినిమాలన్నింట్లో దాదాపుగా హీరోయిన్లు దద్దమ్మలై ఉంటారు. త్రివిక్రమ్ దర్శకుడిగా పరిచయమైన ‘నువ్వే నువ్వే’లో శ్రియ ఒక దద్ది. ‘‘ఈ కాలేజ్ మొత్తంలో బాడీ ఎదిగినా బుర్ర ఎదగంది అదొక్కత్తే’ అంటూ హీరోయిన్ గురించి ఒక డైలాగ్ కూడా ఉంటుందందులో. ఇక ‘అతడు’ సినిమాలో త్రిష సంగతి తెలిసిందే. ఆ పాత్ర కూడా మరీ అమాయకంగా కనిపిస్తుంది.

ఇక ‘జల్సా’లో ఇలియానా.. ‘ఖలేజా’లో అనుష్క.. ‘అత్తారింటికి దారేది’లో సమంత.. ఇలా వీళ్లందరూ ఏవో మైనస్‌లతో కనిపిస్తారు. వాళ్ల మీద హీరోలు దారుణమైన సెటైర్లు వేస్తుంటారు. ఏదో ఒక సందర్భంలో ఆ పాత్రల గాలి తీసేస్తుంటాడు త్రివిక్రమ్. చివరికి హీరోయిన్ పాత్రకు బాగా ప్రాధాన్యమున్న ‘అఆ’లో కూడా సమంతను దద్దమ్మ లాగే చూపిస్తాడు.

ఇప్పుడిక ‘అజ్ఞాతవాసి’లో అయితే హీరోయిన్లు మరీ తీసికట్టుగా తయారు చేసి పెట్టాడు త్రివిక్రమ్. ఇద్దరు హీరోయిన్లవీ చెత్త పాత్రలే. త్రివిక్రమ్ గత సినిమాల్లో కనీసం హీరోయిన్ల పాత్రలు ఎంటర్టైన్మెంట్ అయినా ఇచ్చేవి. ఇందులో అదీ లేదు. రెండు పాత్రలకూ తలా తోకా ఉండదు. హీరో ఒక చూపు విసరగానే ఫ్లాట్ అయిపోయి అతడి వెనుక తిరిగే క్యారెక్టర్లివి. ఈ పాత్రల విషయంలో త్రివిక్రమ్ బాగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మొత్తంగా త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రల వరస చూస్తే మాత్రం ఆయనకు అమ్మాయిలపై చులకన అభిప్రాయం ఉందేమో అన్న సందేహం కలగడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు