అక్కడ హిట్టు.. ఇక్కడ రిలీజవుతున్నట్లే లేదు

అక్కడ హిట్టు.. ఇక్కడ రిలీజవుతున్నట్లే లేదు

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో మాంచి హిట్టు కొట్టి తెలుగులో హీరోగా నిలదొక్కుకున్నట్లే కనిపించాడు సందీప్ కిషన్. దీని తర్వాత ‘బీరువా’.. ‘టైగర్’ లాంటి సినిమాలు ఓమోస్తరుగా ఆడి అతడి కెరీర్‌కు కొంత ఉత్సాహాన్నిచ్చాయి. కానీ గత రెండేళ్లలో వరుస ఫ్లాపులు అతడిని కుంగదీసేశాయి. హీరోగా అతడి మార్కెట్ పూర్తిగా దెబ్బ తినేసింది.

గత నెలలో విడుదలైన సందీప్ కిషన్ కొత్త సినిమా ‘నా పేరు సూర్య’కు టాక్ పర్వాలేదన్నా కూడా ఆడలేదు. ఆ సినిమా వచ్చింది తెలియదు వెళ్లింది తెలియదు. ఐతే తమిళంలో ఇటీవలే ‘మాయవన్’ అనే సినిమాతో హిట్టు కొట్టాడు సందీప్. ఈ ఏడాది ఆరంభంలో ‘మానగరం’ తర్వాత సందీప్‌కు తమిళంలో ఇది మరో మంచి హిట్‌గా నిలిచింది.

ఈ నెల 14న తమిళంలో విడుదలై హిట్టయిన ‘మాయవన్’ను అప్పటికే ‘ప్రాజెక్ట్ జడ్’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఒకేసారి తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు. ఇప్పుడేమో రెండు వారాలు లేటుగా ఈ శుక్రవారానికి రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ ఈ సినిమా విడుదలవుతున్నట్లే అనిపించట్లేదు. దీనికి అసలేమాత్రం ప్రమోషన్లే లేవు. తమిళంలో ఇప్పటికే హిట్టయిన సినిమాను సందీప్ కిషన్ కూడా ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు.

ఏమాత్రం బజ్ లేకుండా ఈ సినిమా రిలీజవుతోంది. ఇలా తన సినిమాను తానే వదిలేస్తే జరిగే డ్యామేజ్ ఏంటో సందీప్‌కు తెలియంది కాదు. లావణ్య త్రిపాఠి.. జాకీష్రాఫ్ లాంటి పేరున్న నటులు ఈ సినిమాలో ఉన్నారు. పైగా మంచి థ్రిల్లర్ మూవీ. తమిళంలో హిట్టయింది కూడా. దీన్ని సరిగ్గా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తే మంచి ఫలితమే అందుకునే అవకాశముంది. మరి ఈ చిత్రాన్ని అలా వదిలేయడానికి కారణాలేంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు