ఆయన ముఖ్యమంత్రి కావాలంటున్న మనోజ్

ఆయన ముఖ్యమంత్రి కావాలంటున్న మనోజ్

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గురించి ఏం మాట్లాడని మంచు మనోజ్.. తమిళ రాజకీయాల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమిళనాట లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని మనోజ్ ఆకాంక్షించాడు.

కమల్ హాసన్ మేధావి అని.. ఆయనకు అన్ని విషయాలపైనా అవగాహన ఉందని.. తమిళనాట పరిస్థితులపై, రాజకీయాలపై ఆయనకున్నంత అవగాహన ఇంకెవరికీ లేదని.. ఆయన ముఖ్యమంత్రి అయితే మంచి జరుగుతుందని మనోజ్ అభిలషించాడు. కమల్ నటుడిగానే కాకుండా వ్యక్తిగానూ తనకెంతో నచ్చుతాడని.. ఆయన రాజకీయాల్లోకి రావడం మంచి విషయమని మనోజ్ అన్నాడు.

మన దగ్గర రాజకీయంగా పరిస్థితి బాగుందని.. తమిళనాడు పరిస్థితులే బాగా లేవని.. అక్కడ కమల్ ముఖ్యమంత్రి అయితే మంచి జరుగుతుందని మనోజ్ అన్నాడు. ఓవైపు మోహన్ బాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి వస్తాడని ప్రచారం జరుగుతోంది. మరి రజినీ ముఖ్యమంత్రి కోవాలని కోరుకోకుండా మనోజ్.. కమల్ పేరు చెప్పి ఆయనే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించడం ఆశ్చర్యకరమైన విషయమే.

రజినీ రాజకీయాల్లోకి వచ్చే విషయమై తటపటాయిస్తున్న నేపథ్యంలో మనోజ్ ఇలా మాట్లాడాడేమో మరి. ఇక తాను రాజకీయాల్లోకి రావడం గురించి కూడా మనోజ్ మాట్లాడాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశాలేమీ లేవన్నాడు. ఐతే ప్రజల్లోకి వెళ్లి సేవ చేయాలని.. సమస్యలపై పోరాడాలని.. ముఖ్యంగా రైతుల్ని ఆదుకోవాలని ఉందని.. ఆ ప్రయత్నం ఇప్పట్నుంచే చేస్తున్నానని మనోజ్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English