ఎన్టీఆర్ ఎక్కువ చెప్పేశాడేమో..

ఎన్టీఆర్ ఎక్కువ చెప్పేశాడేమో..

'జై లవకుశ' దర్శకుడు కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ తొలి సినిమా 'పవర్' రొటీన్‌గా ఉంటుంది. ఆ తర్వాత అతను చేసిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సంగతీ తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేసిన 'జై లవకుశ' కూడా మరీ కొత్తగా ఉంటుందన్న అంచనాలేమీ లేవు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన రెండు టీజర్లు, ఇతర ప్రోమోలు చూస్తే ఇది కూడా కొత్తగా అనిపించే సినిమా ఏమీ కాదని స్పష్టమవుతోంది.

ఐతే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా గురించి ఓ రేంజిలో చెబుతున్నాడు. 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్' లాంటి వైవిధ్యమైన సినిమాలతో తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన తారక్.. రొటీన్ మూవీలా కనిపిస్తున్న 'జై లవకుశ'ను కూడా ఓ మైలురాయిలా చెబుతున్నాడు.

తనకు 'జై లవకుశ' ఒక సినిమా కాదని.. అంతకుమించి అని.. తన అన్నయ్య కళ్యాణ్ రామ్, తాను కలిసి తమ తండ్రి హరికృష్ణకు ఇస్తున్న షష్టిపూర్తి కానుక ఇదని ఎన్టీఆర్ అన్నాడు. అన్నదమ్ముల అనుబంధం గురించి వివరించే కథ ఇదని.. తమ తల్లిదండ్రులకు ఈ సినిమాను గర్వంగా చూపించాలనుకుంటున్నామని.. తమ పిల్లలు భవిష్యత్తులో ఈ సినిమాను ఆనందంగా చూసేలా ఉంటుందని ఎన్టీఆర్ అన్నాడు. 'జనతా గ్యారేజ్' తర్వాత ఏం సినిమా చేయాలా అని చాలా ఆలోచించానని.. నచ్చిన సినిమా ఎంచుకోవాలా, ట్రెండు ఫాలో అవ్వాలా అన్న సందిగ్ధంలో ఉన్న దశలో బాబీ 'జై లవకుశ' కథ చెప్పాడని, తన మనసుకు నచ్చిన కథనే చేయాలని అప్పుడే డిసైడయ్యానని ఎన్టీఆర్ చెప్పాడు.

తన కెరీర్లో అత్యంత సంతృప్తినిచ్చిన కథలో 'జై లవకుశ' తప్పకుండా ఉంటుందని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. ఐతే ట్రెండును ఫాలో అవ్వాలా.. మనసుకు నచ్చిన చిత్రం చేయాలా అన్న సందిగ్ధతలో రెండో మాటకే ఓటేశానని ఎన్టీఆర్ చెప్పడం చూస్తే.. ఇది ఈ ట్రెండుకు తగ్గ వైవిధ్యమైన సినిమా కాదని, రొటీన్‌గానే ఉంటుందని ఎన్టీఆర్ చెప్పకనే చెప్పినట్లున్నాడు. మరి ఎన్టీఆర్ చెబుతున్నట్లుగా తన తల్లిదండ్రులకు గర్వంగా చూపించేంతగా.. అతడి కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచే స్థాయి 'జై లవకుశ'కు ఉందో లేదో ఈ నెల 21న తెలుసుకుందాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు