150లో చేస్తానని అడిగితే చిరు వద్దన్నాడట

150లో చేస్తానని అడిగితే చిరు వద్దన్నాడట

తమిళ హీరో శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. ఒకప్పుడు ఆయన తమిళంలో కథానాయకుడిగా నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమయ్యాయి. నేరుగా తెలుగులోనూ కొన్ని సినిమాలు చేశారాయన. ‘గ్యాంగ్ లీడర్’లో చిరంజీవికి అన్నయ్యగా ఆయన చేసిన పాత్రను ఎవ్వరూ మరిచిపోలేరు. అలాగే ‘బన్నీ’లో అల్లు అర్జున్ తండ్రిగానూ మెప్పించారు. ఆయన చాన్నాళ్ల తర్వాత తెలుగులో నటించిన సినిమా ‘నేనోరకం’. ఈ శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తెలుగు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పాడు శరత్.

మెగాస్టార్ చిరంజీవితో తనది గొప్ప అనుబంధమని.. ఆ చనువుతోనే ఆయన 150వ సినిమాలో నటిస్తానని స్వయంగా అడిగానని శరత్ తెలిపాడు. ఐతే తాను చిన్న పాత్ర ఏదైనా ఇవ్వమంటే.. అలాంటి పాత్రలు నువ్వు చేయడమేంటి.. వద్దు అని చిరంజీవి నో చెప్పేశాడని శరత్ తెలిపాడు. ‘గ్యాంగ్ లీడర్’ చేసేటపుడే చిరు తర్వాతి సినిమాల్లోనూ నటించే అవకాశం ఇవ్వమని అడిగానని.. ఐతే ‘నువ్వు పెద్ద హీరో అవుతావురా.. వద్దులే’ అని చిరు చెప్పాడని.. ఆయన అన్నట్లే తాను తమిళంలో స్టార్ హీరోగా ఎదిగానని అన్నాడు శరత్.

ఇక నడిగర్ సంఘానికి సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలపై శరత్ స్పందిస్తూ.. ‘‘మొదట నేను రూ.150 కోట్ల అవినీతికి పాల్పడ్డానని అన్నారు. తర్వాత రూ.60 కోట్లన్నారు. ఇప్పుడు రూ.37 లక్షలంటున్నారు. నన్ను నడిగర్ సంఘం నుంచి తొలగించారు. నాపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలే’’ శరత్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు