ఆ డైరెక్టర్లకు గట్టిగా ఇచ్చిన బాలయ్య

ఆ డైరెక్టర్లకు గట్టిగా ఇచ్చిన బాలయ్య

ఒక కథను దర్శకులు ఒక హీరో దగ్గరికి తీసుకెళ్లడం.. ఆ హీరో నో అంటే మరో హీరోకు వినిపించడం సినీ పరిశ్రమలో మామూలే. ఐతే తన దగ్గర మాత్రం ఇలాంటివి జాన్తానై అంటున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ కథ మీకోసమే పుట్టింది అంటూ తన దగ్గరికి వచ్చే దర్శకులంటే తనకు చిరాకు అంటున్నాడు బాలయ్య. తాను ఇప్పుడు పని చేసిన క్రిష్ ఒరిజినల్ డైరెక్టర్ అని.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కథను తనకోసమే రాశాడని.. కానీ చాలామంది పెద్ద దర్శకులు కథల విషయంలో అబద్ధాలు చెబుతుంటారని బాలయ్య విమర్శించాడు.

‘‘క్రిష్‌‌తో నాకు ఇంతకుముందు పరిచయం లేదు. ఆయన ఇదివరకు తీసిన ఐదు సినిమాల్లో ఒకదానికి ఇంకోదానికి పోలిక ఉండదు. అంత వైవిధ్యమైన సినిమాలు తీశాడు. నేను అతణ్ని స్పీల్ బర్గ్‌తో పోలుస్తాను. స్పీల్‌బర్గ్‌ తీసిన సినిమాలకు ఒకదానితో ఒకటి పోలిక ఉండదు. అంతటి కెపాసిటీ ఉన్న దర్శకుడు క్రిష్‌. తెలుగులో చాలా మంది దర్శకుల సంగతి నాకు తెలుసు. వాళ్లలో పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఉన్నారు. వీళ్ల జబ్బేంటంటే.. ఒకే రకమైన సినిమాలు చేస్తుంటారు. ఒకే హీరోని పట్టుకొని చేస్తుంటారు. కానీ వేరే వాళ్ల కోసం రాసిన కథల్ని పట్టుకుని నా దగ్గరికొచ్చి.. మీ కోసమే ఈ కథ రాశామని చెబుతుంటారు. నాకు తెలుసు.. అదెవరి కోసం తయారుచేశారో. వాళ్లు రిజెక్ట్‌ చేసింది తీసుకొచ్చి నాకు చెబుతారు. అలాంటి సినిమాల్ని నేనెందుకు చేస్తాను’’ అని బాలయ్య ప్రశ్నించాడు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి గొప్ప సినిమాను వందో చిత్రంగా చేయడం తన అదృష్టమని.. ఇకపై తన ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉంటుందని బాలయ్య అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు