మూడు వారాల్లో రూ.21,70,000 కోట్లు నష్టపోయారు

మూడు వారాల్లో రూ.21,70,000 కోట్లు నష్టపోయారు

రూ.21,70,000. ఈ అంకెను అంకెల్లో కాకుండా అక్షరాల్లో చెప్పాల్సి వస్తే.. ఇరవై ఒక్క లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయి. ఇదెంత భారీ మొత్తమో సింఫుల్‌ లెక్కలో చెప్పాలంటే.. ఇప్పుడున్న ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి వార్షిక బడ్జెట్‌ ను కాస్త అటూఇటూగా ఓ 16 ఏళ్ల పాటు పెట్టేయొచ్చు. ఇంత భారీ మొత్తాన్ని ప్రపంచంలోని 400 మంది కుబేరులు కేవలం మూడు వారాల వ్యవధిలో కోల్పోయారు. వినటానికే షాకింగ్‌ గా ఉన్న మాటను.. స్వయంగా అనుభవిస్తే మరెంత బాధగా ఉంటుందో కదా.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వచ్చిన మార్పు కారణంగా కేవలం వారాల వ్యవధిలో ఇంత భారీ మొత్తంలో సంపద మొత్తం ఆవిరైపోయింది. ప్రపంచంలో తొలి 400 మంది బిలియనీర్లు గత మూడు వారాల వ్యవధిలో ఇంత భారీ మొత్తంలో నష్టపోయారు. ఒక దశలో.. కేవలం వారం వ్యవధిలో వారు నష్టపోయిన మొత్తం మన రూపాయిల్లో రూ.7,13,000 కోట్లు (డాలర్‌ ధర ఒక్కింటికి రూ.62 చొప్పున లెక్కిస్తే) కావటం గమనారం.

ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్‌ ఈక్విటీల వృద్ధిరేటు తీవ్రంగా పడిపోవటంతో ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ లో భారీగా నష్టపోయిన వారిలో అమెజాన్‌ డాట్‌ కామ్‌ ఇంక్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజాస్‌ సుమారు రూ.55,180కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. బిల్‌  గేట్స్‌ విషయానికి వస్తే.. ఆయన నష్టపోయిన మొత్తం రూ.42,160కోట్లు కాగా.. చైనా అపర కుబేరుడు వాంగ్‌ జియాంగ్‌ లిన్‌ రూ.39,680కోట్లు నష్టపోయారు. ఇలా ప్రపంచంలోని అపర సంపన్నులంతా కేవలం మూడు వారాల వ్యవధిలో భారీగా నష్టపోయారు.

ఇంత నష్టంలోనూ లాభ పడిన వారు ఉండటం విశేషం. మొత్తం 400 మంది అత్యధిక సంపన్నులలో అందరూ నష్టపోగా కేవలం తొమ్మిది మంది మాత్రం లాభ పడటం విశేషం. అలా లాభపడిన వారిలో మన దేశానికి చెందిన రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఒకరు. ఆయన ఈ ఎపిసోడ్‌ లో రూ.3,844కోట్ల మేర వృద్ధి కనిపించింది. ఇంత భారీ నష్టంలోనూ లాభపడటం చూస్తే అంబానీకి ఎంత సుడి అనిపించక మానదు కదూ..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు