సినిమా రివ్యూ: సైజ్‌ జీరో

సినిమా రివ్యూ: సైజ్‌ జీరో

సినిమా రివ్యూ: సైజ్‌ జీరో
రేటింగ్‌: 2.75/5
తారాగణం: అనుష్క, ఆర్య, ప్రకాష్‌రాజ్‌, సోనాల్‌ చౌహాన్‌ తదితరులు
సంగీతం: కీరవాణి
కెమెరా: నిరవ్‌షా
ఎడిటర్‌: ప్రవీణ్‌ పుడి
నిర్మాత: ప్రసాద్‌ వి. పొట్లూరి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.ఎస్‌. ప్రకాశరావు

అద్భుత సౌందర్య రాశి అయిన అనుష్క ఒక క్యారెక్టర్‌ కోసమని చాలా బరువు పెరగడం, ఓవర్‌సైజ్‌లో కనిపించడం ఆశ్చర్యపరిచింది. అదే సైజ్‌ జీరో చిత్రానికి ఆకర్షణ తెచ్చి పెట్టింది. ప్రచార చిత్రాల నుంచి ఈ చిత్రం ప్రతి విషయంలోను ఆసక్తికరంగానే తోచింది. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశరావు మొదటి చిత్రం నిరాశ పరిచినా కానీ ఈసారి అందరినీ అలరించే వినోదాత్మక చిత్రం సిద్ధం చేస్తున్నాడనే ఫీలింగ్‌ వచ్చింది. ఈ చిత్రం చేయడం కోసమని బరువు పెరగడమే కాకుండా, ఇది చేసినన్నాళ్లు మరో సినిమా చేయకుండా, ఇప్పటికీ పెరిగిన బరువుని తగ్గించుకునే పనిలోనే వున్న అనుష్క వరకు అయితే ఈ చిత్రానికి నూటికి రెండొందల శాతం న్యాయం చేసింది. అయితే అనుష్క పడ్డ కష్టంలో సగమైనా ఈ చిత్ర దర్శకుడు పడి వున్నట్టయితే దీని ఫలితం మరోలా వుండేది.

కథ:  
బాగా లావుగా వున్న స్వీటీకి (అనుష్క) పెళ్లి చేయడానికి వాళ్ల అమ్మ (ఊర్వశి) నానా తంటాలు పడుతూ వుంటుంది. వచ్చిన ప్రతి పెళ్లికొడుకు ఆమెని రిజెక్ట్‌ చేస్తుంటాడు. తనని పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చి రిజెక్ట్‌ చేసిన అభితో (ఆర్య) ప్రేమలో పడుతుంది స్వీటీ. కానీ అతను స్లిమ్‌గా, ఫిట్‌గా వున్న సిమ్రన్‌కి (సోనాల్‌) దగ్గర కావడంతో ఎలాగైనా లావు తగ్గాలని సైజ్‌ జీరో అనే స్లిమ్మింగ్‌ సెంటర్‌లో జాయిన్‌ అవుతుంది. అక్కడ వాడే పద్ధతుల వల్ల తన స్నేహితురాలికి ప్రాణాపాయం వస్తే ఆ సెంటర్‌ని మూయించడానికి కంకణం కట్టుకుంటుంది.

కథనం:
లావుగా వుండే వాళ్ల మీద కుళ్లు జోకులు వేసి నవ్వించే ప్రయత్నం చేయకుండా, అలాంటి హీనమైన హాస్యం జోలికి పోకుండా క్లీన్‌గా తీశారు. అదొక్కటే ఈ చిత్ర పరంగా దర్శకుడికి దక్కే క్రెడిట్‌. లావుగా వుండేవాళ్ల మానసిక సంఘర్షణ, ఆత్మనూన్యతాభావం వగైరా విషయాల మీద ఫోకస్‌ పెట్టినట్టయితే, వాళ్లు అలా వుండి కూడా విజయాలు సాధించగలరు, అదొక వైకల్యం కాదని చూపించినట్టయితే సైజ్‌ జీరో ఎమోషనల్‌గా కట్టి పడేసి వుండేది. కానీ దర్శకుడు అసలు కథ నెత్తికి ఎత్తుకున్నప్పటి నుంచి ఎస్కేపిస్ట్‌ మెంటాలిటీ చూపించాడు.

కథని పూర్తిగా స్లిమ్మింగ్‌ టెక్నిక్స్‌, వాటి మీద హీరోయిన్‌ చేసే పోరాటం మీదకి మళ్లించడంతో ఫస్ట్‌ హాఫ్‌లో వున్న ఫీల్‌ గుడ్‌ అనుభూతి సెకండ్‌ హాఫ్‌లో టోటల్‌గా మిస్‌ అయింది. లావుగా వుండే వ్యక్తి ప్రేమకథని వినాయకుడు చిత్రంలో అడివి సాయికిరణ్‌ చాలా బాగా చూపించాడు. అనుష్కలాంటి ప్రతిభగల నటిని పెట్టుకుని కూడా దర్శకుడు తన కథని సవ్యంగా నడిపించలేక చతికిలపడ్డాడు.

ఆర్యకి తగిలించిన ఆ క్లీన్‌ ఇండియా డాక్యుమెంటరీ కాన్సెప్ట్‌ ఎందుకోగానీ దాని వల్ల వినోదం పండలేదు. కనీసం కథకి ఎలాంటి వేల్యూ యాడ్‌ అవలేదు. అదే విధంగా ఫేక్‌ బాబాగా బ్రహ్మానరదం కూడా వృధా అయ్యాడు. ఆ సన్నివేశాలతో కామెడీ ఏమాత్రం వర్కవుట్‌ కాలేదు. అసలు ఆ సీన్స్‌ అన్నీ తొలగించినా కానీ సినిమాలో ఎలాంటి లోటు కనిపించదు. అనుష్క తమ్ముడు భరత్‌కి లాంజరీ తయారు చేసే కంపెనీ వుందంటారు. దాని వల్ల కూడా ఉపయోగం లేదు. ఇలాంటి ఎన్నో అవసరం లేని విషయాల మీద టైమ్‌ వేస్ట్‌ చేసిన దర్శకుడు సెకండ్‌ హాఫ్‌కి వచ్చేసరికి అసలు తను సృష్టించిన పాత్రనే వృధా చేసాడు. చాలా బ్యాడ్‌ స్క్రీన్‌ప్లే రాసుకోవడం వల్ల ఈ చిత్రం చూడ్డానికి అనుష్క తప్ప మరో చెప్పుకోతగ్గ కారణం కానీ, అంశం కానీ లేకపోయింది.

సెకండ్‌హాఫ్‌లో స్నేహితురాలి కిడ్నీ ఆపరేషన్‌ కోసం ఫండ్‌ రైజింగ్‌ చేసే హీరోయిన్‌ ఇక అదే పని మీద వుంటుంది. కథలో విషయం లేక క్లయిమాక్స్‌ వరకు ఆ ఒక్క అంశం మీదే సమయం మొత్తం గడిపేసారు. కనీసం పతాక సన్నివేశాల్లో అయినా వినోదం లేకపోగా ఊహించినట్టుగానే హీరో హీరోయిన్లిద్దరూ ఒక్కటౌతారు. ఈ విషయం కథ మొదలైనప్పుడే తెలుస్తుంది కనుక కనీసం ముగింపు అయినా వేరేలా ప్లాన్‌ చేసుకుని వుండాల్సింది.

నటీనటులు:
అనుష్క లేకపోతే ఈ సినిమా లేదు. ఆమె కాకపోతే ఈ సినిమా చూడక్కర్లేదు. అంతగా తన పాత్రకి ప్రాణం పోసింది. ఆర్యని మరీ పాసివ్‌ పాత్రలో వేస్ట్‌ చేసారు. సోనాల్‌ చౌహాన్‌ గ్లామర్‌ ప్లస్‌ అయింది. అడివి శేష్‌, ప్రకాష్‌రాజ్‌ సోసో అనిపిస్తారు. ఊర్వశి, గొల్లపూడి తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతికవర్గం:
పాటలు బాగోలేవు. కీరవాణి నుంచి ఇలాంటి మీడియోకర్‌ అవుట్‌పుట్‌ రావడం వింతగా తోస్తుంది. కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్‌ కూడా బాగానే వుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రాజీ పడకుండా సినిమాకి తగిన ఖర్చు పెట్టారు. దర్శకుడిగా ప్రకాశరావు మరోసారి తన అనుభవ లేమి బయటపెట్టుకున్నాడు. వేరే దర్శకులకి దర్శకత్వ పర్యవేక్షణ చేసి వారిని గైడ్‌ చేసే రాఘవేంద్రరావు తనయుడి విషయంలో జోక్యం చేసుకోవడం లేదెందుకో మరి.

చివరిగా...
అనుష్క అభిమానులకి మాత్రమే తప్ప ఈ చిత్రం ఇతరులని ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది. ఆమె చాలా కష్టపడినా కానీ అంతిమంగా ఫలితాన్ని మార్చలేకపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు