కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీ స్టార్‌వార్ట్‌గా ఆయన ప్రసిద్ధి చెందారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి అన్నీ తానై 2004-2009 వరకు ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా, పార్టీని పరోక్షంగా నడిపించారు.
ఒకరకంగా చెప్పాలంటే.. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీనేకుడి భుజం. అందుకే వైఎస్ ఎగస్పార్టీ మీడియా.. ఏకంగా కేవీపీని వైఎస్ ఆత్మ
గా సంబోధించింది. అంతలా వైఎస్ కుటుంబంతో పెనవేసుకున్న కేవీపీకి వైఎస్ మరణం తర్వాత పెద్దగా ఆదరణ దక్కలేదు.
జగన్‌తో కేవీపీ సంబంధాలు కొనసాగించాలని చూశారు. అంతేకాదు.. అసలు వైసీపీని ఏర్పాటు చేయొద్దని కూడా సలహాలు ఇచ్చారు. కానీ, జగన్‌కు ఇది నచ్చలేదు. దీంతో అంటీముట్టనట్టే కేవీపీని పక్కన పెట్టారు. దీంతో ఆయన జాతీయ రాజకీయాలకే కొన్నాళ్లు పరిమితం అయ్యారు.
ఇక, వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలోనూ కేవీపీ దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆమె తరఫున అధిష్టానంతోనూ పలు మార్లు చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
వైఎస్ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు, పోయిన ఓటు బ్యాంకును(ఏపీ) తిరిగి రాబట్టుకునేందుకు షర్మిల కరెక్ట్ పర్సన్ అని చెప్పిన వారిలో కేవీపీ ముందున్నారు. అంతేకాదు.. తొలి నాళ్లలో పార్టీ అధిష్టానం అప్పాయింట్‌మెంట్లను కూడా ఆయన చూశారు. ఏపీ పగ్గాలు చేపట్టినప్పుడు కేవీపీ ముందుండి నడిపిస్తా రని.. అప్పట్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తుండే ఉంటాయి. అలాంటి కేవీపీ ఎన్నికలకు ముందు నుంచి షర్మిలతో విభేదిస్తున్నారు.
ముఖ్యంగా జగన్‌ను టార్గెట్ చేసే విషయంలో ఆయన ఒక్క అడుగు వెనక్కి వేయాలన్నది ప్రధాన సూచన. ఇది కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. నిజం. జగన్‌ను తిట్టినందున ప్రజలు కాంగ్రెస్‌కు కనెక్ట్ కాబోరన్నది కూడా ఆయన మేలైన సూచన. కానీ, షర్మిల పట్టించుకోలేదు. దీంతో ఆయన ఏపీ బాధ్యతల నుంచి పరోక్షంగా తప్పుకొన్నారు. ఎన్నికల తర్వాత కూడా షర్మిల ఇదే పంథాతో ముందుకు సాగడంతోపాటు.. ఏకంగా కేవీపీ పైనే అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు తాజాగా వెలుగు చూసింది.
కేవీపీ వంటి సీనియర్లను పాత నేతలు
గా సంబోధించినట్టు తెలిసింది. ఈ పరిణామాలతో కేవీపీ హర్ట్ అయ్యారని.. అప్పటి నుంచి ఏపీ కాంగ్రెస్‌ను పట్టించుకోవడం మానేశారని తెలుస్తోంది. ఇక, కేవీపీకి అనుకూలంగా ఉన్న ఏపీ నేతలు కూడా ఇటీవల కాలంలో షర్మిలకు దూరంగా ఉంటున్నారు. మొత్తంగా చూస్తే.. షర్మిల వ్యవహారంపై కేవీపీ వంటి సీనియర్లు గుర్రుగా ఉండడం.. ఆమె రాజకీయ ఎదుగుదలకు ఇబ్బందిగా నే మారిందని సమాచారం.