మాజీ మంత్రి బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఓటుకు నోటు దొంగతో కలిసి కూర్చుని.. మంత్రి శ్రీధర్ బాబు చెడిపోయారు. లేకపోతే, ఆయన చాలా మంచి వ్యక్తి” అని వ్యాఖ్యానించారు. తాజాగా కేటీఆర్.. హైడ్రా సహా మూసీ నది పక్కన ఆక్రమణలు తొలగించిన బాదితుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. హైడ్రా కూల్చివేతల బాధితులను చులకనగా చూస్తున్నారని.. వారిని ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు.
అయితే.. శ్రీధర్‌బాబు ఉన్నత విద్యావంతుదని కేటీఆర్ పేర్కొన్నారు. మంచి సంస్కారం ఉన్న వ్యక్తి అని, తనకు ఆయనంటే ఎంతో గౌరవం కూడా ఉందన్నారు. కానీ, సావాస దోషంతో శ్రీధర్‌బాబు చెడిపోయారని చెప్పారు. ఓటు కు నోటు దొంగ పక్కన కూర్చుని.. శ్రీధర్ చెడిపోయారన్నారు. అందుకే సంస్కారవంతుడైన మంత్రి శ్రీధర్ కూడా నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నార ని విమర్శలు గుప్పించారు. హైడ్రా కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితుల పట్ల కనీసం సానుభూతి కూడా చూపించడం లేదన్నారు. పైగా.. 5 వేల రూపాయల కోసమే బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మంత్రి చెప్పడం దారుణమన్నారు.
తీవ్ర ఆరోపణలు..
ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పీసీసీ చీఫ్ పదవిని 50 కోట్లకు అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సీఎం పదవిని కూడా 500 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని అన్నారు. మంత్రులు అవినీతి పరులుగా మారిపోయారని, పర్సంటేజీలు పంచుకుంటున్నారని, ఒకరినొకరు కాపాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి అలవాట్లు తెలంగాణ ప్రజలకు లేవన్నారు. 5 వేల రూపాయల కోసం ఏడుస్తున్నారన్న వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. శ్రీధర్‌బాబు బయట తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
కాగా, కేటీఆర్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ నాయకులు భగ్గు మంటున్నారు. ఓటుకు నోటు దొంగ అంటూ.. పరోక్షంగా ఈ కేసులో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించే కేటీఆర్ వ్యాఖ్యానించారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తమ రియాక్షన్ డిఫరెంట్‌గా ఉంటుందని హైదరాబాద్‌కు చెందిన ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.