రాజకీయాల్లో నాయకులు ముందుంటారు. కార్యకర్తలను వారే నడిపిస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే. అయితే .. వైసీపీలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. నాయకుడిగా జగన్ సేఫ్ జోన్ చూసుకుంటున్నా రు. కార్యకర్తలు మాత్రం బలయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలోనూ.. ఇప్పుడు కూడా.. కార్యకర్తలు, చోటా నాయకులు కేసుల్లో చిక్కుకుంటున్నారు. పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. జైళ్లకు వెళ్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనూ ఇప్పటికీ 30 మంది వైసీపీ కార్యకర్తల్లో జైళ్లలోనే మగ్గుతున్నారు.
కీలక నాయకులు మాత్రం సేఫ్‌గా బయటకు వచ్చారు. బెయిల్ తెచ్చుకున్నారు. మరి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల పరిస్థితి ఏంటనేది మాత్రం జగన్ ఏమాత్రం ఆలోచించడం లేదు. ఇక, ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. శనివారం(ఈ రోజు) రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చింది. జగన్ తిరుమల పర్యటనకు వెళ్తున్నారని(దీనిని రద్దు చేసుకున్నారు) ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేసి నిరసన వ్యక్తం చేయాలని పార్టీ పేర్కొంది.
దీంతో కార్యకర్తలు, చోటా నాయకులు నిరసన కార్యక్రమాల కోసం రెడీ అయ్యారు. అయితే.. ఎక్కడికక్కడ పోలీసులు మాత్రం ఈ కార్యక్రమాలు అనుమతులు లేవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఈ వ్యవహారం వివాదానికి దారితీస్తోంది. పోలీసుల ఆంక్షలను కాదని బయటకు వస్తే.. కార్యకర్తలపై కేసు లు పెట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ఇదే జరిగితే.. కార్యకర్తలు బలి అవుతారు. ఇంత జరుగుతున్నా.. జగన్ మాత్రం తన సేఫ్‌టీ తాను చూసుకుంటున్నారు.
నిజానికి కార్యకర్తలకు అండగా ఉండాల్సిన జగన్.. తాడేపల్లిలో కూర్చుని ప్రెస్ మీట్లకే పరిమితం అవుతు న్నారు. పైగా శనివారం రాష్ట్రంలో నిరసనలు చేయాలని చెప్పిన జగన్.. మరోవైపు ఆయన మాత్రం బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ కార్యకర్తలు లబోదిబోమంటున్నారు. తమను అరెస్టు చేసినా, కేసులు నమోదు చేసినా ఎవరు ఆదుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు.