గడిచిన కొద్దిరోజులుగా హైడ్రా కూల్చివేతల హడావుడి లేదు. వినాయక చవితి పండుగ సందర్భంగా కాస్తంత గ్యాప్ ఇచ్చినప్పటికి.. ఈ వీకెండ్ కూల్చివేతలు ఖాయమన్న అంచనాలకు తగ్గట్లే.. ఆదివారం ఉదయాన్నే కూల్చివేతలు మొదలయ్యాయి. అయితే.. ఇందులోనూ ఒక ట్విస్టు ఉంది. హిమాయత్ సాగర్ చెరువు పరిధిలోని అక్రమ కట్టడాలపై కన్నెర్ర ఖాయమన్న మాట వినిపించింది. అది కూడా కాదంటే మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా బుల్డోజర్లు హడావుడి చేయటం ఖాయమంటూ వార్తలు జోరుగా వచ్చాయి.
ఈ అంచనాలకు భిన్నంగా ఆదివారం ఉదయం ఐదారు గంటల ప్రాంతంలో కుకట్ పల్లి నల్లచెరువు.. అమీన్ పూర్ చెరువు పరిధిలోని రెండు ప్రాంతాల్లో కూల్చివేతలకు బుల్డోజర్లను తెచ్చి పెట్టేశారు. కుకట్ పల్లి నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా.. ఎప్టీఎల్.. బఫర్ జోన్ కలిపి ఎడు ఎకరాలు ఆక్రమణలకు గురైంది. బఫర్ జోన్ లోని నాలుగు ఎకరాల్లో 50కు పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఎఫ్ టీఎల్ పరిధిలోని మూడు ఎకరాల్లో 25కు పైగా భవనాలు .. 16 అక్రమ షెడ్లు ఉన్నాయి. వీటన్నింటిని కూల్చేందుకు హైడ్రా బుల్డోజర్లు పని చేస్తున్నాయి.
దీంతో.. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా పెద్ద ఎత్తున పోలీసుల్ని మొహరించారు. తాజా కూల్చివేతలకు సంబంధించి కొన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నారు. నివాసం ఉంటున్న భవనాల్ని మినహాయించి చెరువును ఆక్రమించి నిర్మించిన పదహారు షెడ్ల యజమానులకు గతంలోనే నోటీసులు జారీ అయ్యాయి. ఆదివారం తెల్లవారుజామునే చెరువు పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాల్ని కూల్చివేసే కార్యక్రమం మొదలైంది. మరోవైపు అమీన్ పూర్ చెరువు పరిధిలోనూ అక్రమ కట్టడాల కూల్చివేతల కార్యక్రమం మొదలైంది. దీంతో.. దాదాపు మూడు వారాల గ్యాప్ తో మళ్లీ హైడ్రా కూల్చివేతల కార్యక్రమం షురూ అయినట్లుగా చెప్పాలి.