సుప్రీం ఆదేశాలు.. హైడ్రాకు ప‌గ్గాలు వేసిన‌ట్టేనా?

హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో జ‌రిగిన చెరువుల ఆక్ర‌మ‌ణ‌లు, నాలాల‌ను ఆక్ర‌మించి చేసిన నిర్మాణాల‌పై గ‌త రెండు మాసాలుగా హైడ్రా కొర‌డా ఝ‌ళిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖుల నివాసాలు.. క‌ట్ట‌డాల‌ను కూడా కూల్చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిని అడ్డుకునేందుకు ప‌లువురు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఈ కేసు హైకోర్టు ప‌రిధిలో ఉంది. అయితే.. తాజాగా సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. అది కూడా హైడ్రా త‌ర‌హాలోనే జ‌రుగుతున్న‌ బుల్డోజర్ కూల్చివేతలపై కావ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది.

యూపీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు.. కార‌ణాలు ఏవైనా కూడా కూల్చివేత‌లు చేప‌డుతున్నాయి. దీనికి బుల్ డోజ‌ర్ల‌ను వినియోగిస్తున్నాయి. ఇలా నిర్మాణాల‌ను బుల్ డోజ‌ర్లతో కూల్చివేయ‌డాన్ని ప్ర‌శ్నిస్తూ.. కొంద‌రు ప్ర‌జాసంఘాల నాయ‌కులు స‌హా యూపికి చెందిన బాధితులు సుప్రీంకోర్టులో పిటిష‌న్లు వేశారు. వీటి విచార‌ణ సంద‌ర్భంగా ఇటీవ‌ల సుప్రీంకోర్టు సీరియ‌స్ అయింది. “ఏదైనా కేసులో దోషి అని తేలినా కూడా.. ఆయ‌న స్థిరాస్తిని బుల్ డోజ‌ర్ల‌తో కూల్చేందుకు వీల్లేదు. పైగా ఈ కేసులో ఇల్లు కూల్చేసిన బాధితుడు నిందితుడు మాత్ర‌మే” అని తేల్చి చెప్పింది.

దీనికి సంబంధించి తాజాగా మంగ‌ళ‌వారం ఇచ్చిన ఆదేశాల్లో దేశ‌వ్యాప్తంగా వ‌ర్తించేలా సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. “అక్టోబర్ ఒకటి వరకు దేశవ్యాప్తంగా… బుల్డోజర్ కూల్చివేతలు నిలిపివేయాలి” అని సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. అయితే.. వీటిలో కొన్నింటికి మాత్ర‌మే మిన‌హాయింపు ఇచ్చింది. అవి.. రైల్వే, జలవనరులు, ఫుట్‌పాత్, రోడ్ల ఆక్రమణలు చేసి.. నిర్మించిన వాటిని మాత్ర‌మే కూల్చి వేయాల‌ని పేర్కొంది. మిగిలిన వాటి జోలికి పోరాద‌ని పేర్కొంది.

అయితే.. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు హైడ్రాకు కూడా వ‌ర్తిస్తాయ‌ని కొంద‌రు వాదిస్తున్నారు. కానీ, సుప్రీంకోర్టు స్వ‌యంగా జ‌ల‌వ‌న‌రులు అని పేర్కొన్న నేప‌థ్యంలో హైడ్రాకు వ‌ర్తించే అవ‌కాశం లేద‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిపై ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.