ఆవు చేలో మేస్తే.. వైసీపీ నేత‌లు ఏం చేయాలి?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. వారానికి ఒక సారి బెంగ‌ళూరుకు వెళ్లిపోతున్నారు. వీకెండ్ అక్క‌డే గ‌డిపేసి వ‌చ్చి.. రెండు రోజులు చంద్ర‌బాబుపై ఏవో నాలుగు మాట‌లు అనేసి వెళ్లిపోతున్నారు. మ‌ళ్లీ వీకెండ్ బెంగ‌ళూరు టూరే. ఇదీ.. గ‌త మూడు మాసాల నుంచి జ‌రుగుతున్న ప‌ని. అయితే.. ఆయ‌న చెబుతున్న‌ది ఏంటంటే.. పార్టీ నాయ‌కులు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని! నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని!!

ఈ విష‌యంపైనే అధికారికంగా.. నేత‌లంద‌రికీ ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌.. గెలిచిన నాయ‌కుల‌కు కూడా జ‌గ‌న్ నుంచి సందేశాలు అందాయి. “త‌క్ష‌ణం ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లండి. మీకు న‌చ్చిన రీతిలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించండి. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండండి” అని జ‌గ‌న్ ఇచ్చిన సందేశంలో కీల‌క అంశం. అయితే.. దీనిని ఎంత మంది పాటిస్తున్నారు? అంటే.. జీరో! ఎందుకంటే.. పార్టీ అధినేతే.. స‌వ్యంగా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌న‌ప్పుడు.. ఆ మాట‌కొస్తే.. నాయ‌కుల‌కే ఆయ‌న అందుబాటులో ఉండడం లేదు.

దీంతో నాయ‌కులు కూడా ఎవ‌రికి వారు ఎవ‌రికి తోచిన విధంగా వారు ఉంటున్నారు. చాలా మంది నాయ‌కులు.. త‌మ త‌మ వ్యాపారాలు దెబ్బ‌తిన‌కుండా చూసుకుంటున్నారు. “ఎన్నిక‌ల్లో మా నాయ‌కుడు చాలానే ఖ‌ర్చు పెట్టాడు. ఇప్పుడు న‌ష్టాలు రాకుండా చూసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చే ఆలోచ‌న అయితే.. లేదు” అని సీమ‌కు చెందిన ఇంకా చెప్పాలంటే.. జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌కు చెందిన ఓ మైనారిటీ నాయ‌కుడి అనుచ‌రుడు చెప్పాడు.

ఈ ఒక్క‌రే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రూ ఇదే ప‌నిలో ఉన్నారు. ఇక‌, జ‌గ‌న్ వీర భ‌క్త నాయ‌కులుగా గుర్తింపు పొందిన రోజా, కొడాలి నాని, అనిల్‌కుమార్ యాద‌వ్‌, పాముల పుష్ప శ్రీవాణి, కారుమూరి నాగేశ్వ‌ర‌రావు వంటివారు కూడా.. బ‌య‌ట‌కు రావ‌డం లేదు. మ‌రికొంద‌రు గ‌డుసుగా కూడా వ్యాఖ్యానిస్తున్నారు. “ఆయ‌న కు పాస్ పోర్టు వ‌చ్చి ఉంటే ఇప్పుడు లండ‌న్‌లో ఉండేవారు. ఆయ‌న లేకుండా మేం ఏం చేస్తాం.” అని విజ‌య‌వాడ‌కు చెందిన ఓ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు వ్యాఖ్యానించారు. సో.. జ‌గ‌నే ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోకుండా.. బెంగ‌ళూరు-తాడేప‌ల్లి చుట్టూ తిరుగుతుంటే.. నాయ‌కులు మాత్రం ప్ర‌జ‌ల్లో తిరుగుతారా? అనేది ఇక్క‌డ కీల‌క పాయింట్‌.