బాలినేనికి సెగ కాదు.. మంటే!

Balineni

వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస‌రెడ్డికి వైసీపీ నిన్న మొన్న‌టి వ‌ర‌కు సెగ పెట్టిందని.. మాజీ సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. అస‌లు ఇది.. సెగ కాద‌ని మంటేన‌ని ఆయ‌న‌ను వ‌దిలించుకునేందుకు చూస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. ప్ర‌స్తుతం బాలినేని త‌న దారి తాను చూసుకునేందుకు రెడీ అయ్యార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో జ‌న‌సేన వైపు ఆయ‌న చూస్తున్నార‌ని స‌మాచారం.

బాలినేని వ‌రుస‌కు మాజీ సీఎం జ‌గ‌న్‌కు బంధువు కూడా అవుతారు. అయితే.. జ‌గ‌న్ చిన్నాన్న‌..(వైఎస్ తోడ‌ల్లుడు) వైవీ సుబ్బారెడ్డికి ఒంగోలుతో ఎడతెగ‌ని అనుబంధం ఉంది. ఇక్క‌డే ఆయ‌న సొంత ఇల్లు కూడా ఉంది. గ‌తంలో ఎంపీగా కూడా ఇక్క‌డే విజ‌యంద‌క్కించుకున్నారు. అయితే.. బాలినేని కార‌ణంగా.. త‌న రాజకీయ హ‌వా దెబ్బ‌తిం టోంద‌ని భావించిన వైవీ.. బాలినేనితో ర‌గ‌డ‌కు దిగిన విష‌యం తెలిసిందే. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ కార‌ణంగానే వైవీని ఉమ్మ‌డి ప్రకాశం బాధ్య‌త‌ల‌నుంచి త‌ప్పించారు. అయినా.. బాలినేనికి ప్రాధాన్యం లేకుండా పోయింది. దీనికి కార‌ణం.. ఆయ‌న జ‌న‌సేన‌కు ట‌చ్‌లో ఉండ‌డ‌మేన‌ని గ‌త ఎన్నిక‌ల‌కు ముందే జ‌గ‌న్‌కు స‌మాచారం అందింది. దీంతో జ‌గ‌న్‌.. ఆయ‌న‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టారు. ఈ విష‌యంలో జ‌గ‌న్‌కు బాలినేని ఇవ్వాల్సిన వివ‌ర‌ణ అంతా ఇచ్చారు. అయినా.. గ్రౌండ్ రిపోర్టులు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌న్న‌ది జ‌గ‌న్ వాద‌న‌. అవ‌న్నీ క‌ల్పితాల‌ని బాలినేని వాద‌న‌. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే ఇరువురి మ‌ధ్య రాజ‌కీయంగా గ్యాప్ పెరిగింది.

అయిన‌ప్ప‌టికీ.. అటు బాలినేని పార్టీలోనే ఉన్నారు. ఇటు జ‌గ‌న్ ఆయ‌న‌ను కొన‌సాగిస్తున్నారు. అయితే.. ఫుల్ ప‌వ ర్స్ మాత్రం జ‌గ‌న్ బాలినేనిని ఇవ్వ‌లేదు. ఇదే బాలినేనికి ఇబ్బందిగా మారింది. దీనిపై రెండు రోజుల కింద‌ట ఇరువురి మ‌ధ్య చ‌ర్చ సాగింది. తాను చెప్పిన వారికి పార్టీలో అవ‌కాశం ఇవ్వాల‌న్న బాలినేని వాద‌న‌ను జ‌గ‌న్ తోసిపుచ్చారు. దీంతో బాలినేని హైద‌రాబాద్ వెళ్లిపోయారు. అక్క‌డే ఇప్పుడు కీల‌క ప‌రిణామాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. త‌న మిత్రుడు జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నాగబాబుతో బాలినేని మంత‌నాలు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. ఇవి వ‌ర్క‌వుట్ అయితే.. ఆయ‌న పార్టీ మారి ప‌వ‌న్‌కు జై కొట్ట డంఖాయంగా క‌నిపిస్తోంది.