ఎన్టీఆర్ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం జగ్గయ్యపేట. ఇక్కడ వైసీపీకి బలమైన కార్యకర్తలు వున్నారు. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. అయితే.. ఇప్పుడు ఇక్కడ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. వైసీపీ నాయకులు గుండుగుత్తగా పార్టీ మారిపోయారు. జగ్గయ్యపేల మునిసిపాలిటీ పూర్తిగా టీడీపీ వైపు మొగ్గు చూపింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నెట్టెం రఘురాం నేతృత్వంలో వైసీపీ నేతలు, కార్యకర్త లు భారీ సంఖ్యలో టీడీపీ గూటికి చేరుకున్నారు.
2019 ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ఉదయ భాను.. తర్వాత జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిని ఆశించారు. అయితే.. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. అప్పటి నుంచి వైసీపీపై ఆగ్రహంతో ఉన్నారు. ఇక, ఈఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయభాను ఓడిపోయారు. ఇక, ఆ తర్వాత ఆయన యాక్టివ్ నెస్ తగ్గించారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయందక్కించుకుని జగ్గయ్యపేట మునిసిపాలిటీలో పాగా వేసిన నాయకులను నెట్టె రఘురాం తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేశారు.
వాస్తవానికి ఇలాంటి వి జరిగినప్పుడు ఉదయభాను గతంలో అడ్డుకట్ట వేశారు. పార్టీ నాయకులు జంప్ చేయకుండా ఆయన వ్యవహరించారు. అయితే.. ఇప్పడు మాత్రం చూసీ చూడనట్టే వదిలేశారు. దీంతో భారీ సంఖ్యలో కౌన్సిల ర్లు, నాయకులు జెండా మార్చేశారు. అయితే.. వీరిని ఆపేందుకుఉదయ భాను ప్రయత్నం చేయనట్టు తెలిసింది. ఆయన చెప్పినా ఎవరూ వినరని.. నిర్ధారణకు వచ్చారని కొందరు చెబితే.. అసలు ఆయనే తప్పుకొనే ఆలోచనలో ఉన్నారనేది మరికొందరి మాట.
ఏదేమైనా.. శుక్రవారం ఉదయం జగ్గయ్యపేట మునిసిపాలిటీ వైసీపీ కౌన్సిలర్లు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ గూటికి చేరుకున్నారు. వారికి కండువాలు కప్పిన నారా లోకేష్.. పార్టీ సిద్ధాంతాల మేరకు పనిచేయాలని సూచించారు. ఈ నెల 20వ తేదీ తర్వాత సీఎం చంద్రబాబు అప్పాయింట్‌మెంటు తీసుకుని ఆయనతో భేటీ అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. జగ్గయ్యపేట మునిసిపాలిటీ అభివృద్దికి తన వంతు సహకారం చేస్తానని చెప్పారు. ఈ పరిణామాలతో జగ్గయ్యపేట వైసీపీ ఖాళీ అయినట్టయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates