వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు.. వరద బాధితులను పరామర్శించేందుకు పెద్దగా సమయం లేకుండా పోయింది. కానీ, ప్రస్తుతం జైల్లో ఉన్న వైసీపీ నాయకులను పరామర్శించేందుకు మాత్రం ఆయన అప్పాయింట్‌మెంట్లు రెడీ చేసుకుంటున్నారు. ప్రస్తుతం విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. ఎనిమిది రోజుల తర్వాత కూడా వరద ఇంకా వెంటాడుతోంది. ఇక్కడి వారిని ప్రభుత్వం ఎలానూ ఆదుకుంటోంది.
అయితే…. ప్రతిపక్ష నేతగా, మాజీ సీఎంగా జగన్‌కు కూడా కొంత మేరకు బాధ్యత ఉంటుంది కదా?! ఈ విషయంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. తన పరివారాన్ని పంపించడంలోనూ జగన్ పూర్తిగా మైనస్ అయిపోయారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయవాడ కార్పొరేషన్ ఆయన పరిధిలోనే ఉంది. వైసీపీ నాయకులే నగర కార్పొరేషన్‌లో అధికారం చలాయిస్తున్నారు. అయినా.. కూడా ఇక్కడ బాధితులను పట్టించుకునే తీరిక.. ఓపిక.. కూడా వైసీపీ నాయకులకు లేకుండా పోయింది.
ఇదిలావుంటే.. ఇప్పుడు జగన్ మాత్రం జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. నిన్న మొన్నటి వరకు నెల్లూరు జై ల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డి చుట్టూ తిరిగారు. ఆయనను పరామర్శించారు. ఓదార్చారు. ఇంతలోనే జగన్‌కు అత్యంత ప్రియ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా.. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను కూడా గుంటూరు జైల్లో పెట్టారు. గత రెండు రోజులుగా సురేష్ జైల్లోనే ఉన్నారు..
దీంతో ఈయనను పరామర్శించేందుకు జగన్ రెడీ అయ్యారు. బుధవారం ఆయనను పరామర్శించేందు కు జగన్ వెళ్తున్నట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఇదేదో వరద బాధితులకు సేవ చేసేందుకు వెళ్తున్నారన్న రేంజ్లో ఉండడంతో అందరూ నవ్వుకుంటున్నారు. సీఎం జగన్ బాధిత నేతలను ఓదార్చుతున్నారని.. ఈ క్రమంలోనే ఆయన గుంటూరు జైల్లో నందిగంను పరామర్శించనున్నారని ప్రకటనలో పేర్కొనడంగమనార్హం. మొత్తానికి వరద బాధితుల పరిస్థితి ఎలా ఉన్నా.. జైలు బాధితులను పరామర్శిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates