ఏపీలో ఒకవైపు వరదలు మరోవైపు.. వర్షాలు ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే సమయంలో రాజకీయాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి ఘటనకు సంబంధించిన కేసు ఉరుకులు పరుగులు పెడుతోంది. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న వైసీపీ నాయకులను గత అర్థరాత్రి నుంచి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ప్రస్తుతానికి ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
వీరిలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను గురువారం తెల్లవారు జామున మంగళగిరిలోని ఆయన నివాసంలోనే సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న విజయవాడ నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అవుతు శైలజ భర్త.. ప్రముఖ కాంట్రాక్టర్ అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు యువ నాయకుడు దేవినేని అవినాష్‌ను కూడా అరెస్టు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
అయితే.. ఆయన పోలీసుల కళ్లుగప్పి.. వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇక, ఎమ్మెల్సీలు.. తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డిల అరెస్టుకు కూడా రంగం రెడీ అయినట్టు సమాచారం. వారిద్దరినీ అరెస్టు చేయాల్సి ఉందని.. అనుమతి ఇవ్వాలని.. మండలి చైర్మన్.. మోషేన్ రాజుకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే.. ఆయన అందుబాటులో లేకపోవడంతో అరెస్టు వాయిదా పడినట్టు తెలుస్తోంది. బుధవారం వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.
అంతేకాదు.. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా తగిన గడువు ఇవ్వకపోవడంతోపాటు.. కుట్రకోణం ఉందంటూ.. న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో రాత్రికి రాత్రి.. టీడీపీ ఆఫీసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ రోజు రేపట్లో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇదిలావుంటే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది వైసీపీ కార్యకర్తలు.. ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.