చంద్రబాబు వ్యూహంతో వైసిపి ఖాళీ అయిపోతుందా? ఇదీ ఇప్పుడు జరుగుతున్న ప్రధాన చర్చ. రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బతీయడం, పార్టీలను ఖాళీ చేయటం అనేది ఆది నుంచి ఉన్న సమస్య కాదు. ఒకప్పుడు ప్రతిపక్షాలను గౌరవించే పద్ధతి, పరిస్థితి ఉండేది. అంతేకాదు అసలు ప్రతిపక్షాల నుంచి నాయకులు తీసుకునే సంస్కృతి కూడా ఒకప్పుడు ఉండేది కాదు. కానీ గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. ఒక్క రాష్ట్రంలోనే కాదు. దేశవ్యాప్తంగా కూడా 2000 సంవత్సరం నుంచి మార్పులు చేర్పులు అత్యంత దారుణంగా మారాయి.
తమకు కావాలి అనుకున్న నేతల విషయంలో కేసులు పెట్టడం, వారిని ఏదో ఒక విధంగా లొంగదీసుకో వడం లేదా ప్రలోభాలకు గురి చేయటం అనే సంస్కృతి జాతీయ రాజకీయాల్లోనే మొదలైంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు వచ్చేసరికి మరింత ఎక్కువగా మారింది. చెప్పింది వినటమా? లేదా భయపెట్టి తీసుకోవడమా అనే ఈ రెండు సూత్రాలు ఎప్పుడు పని చేస్తున్నాయి. తెలంగాణలోనూ ఇదే జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలోను జగన్ హయాంలోనూ ఇలాగే జరిగింది. చంద్రబాబు హయాంలోనూ ఇలాగే జరిగింది.
అవకాశం – అవసరం అనే ఈ రెండు పట్టాలపైనే రాజకీయ నాయకులు పార్టీలు కూడా ప్రయాణం చేస్తున్నాయి. ఇలా చూసుకుంటే వైసీపీ ఖాళీ అవుతుందనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అయితే చంద్రబాబు వ్యూహం వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. తమకు అవసరమున్నంత మేరకు నాయకులను తీసుకుని మిగిలిన వారి విషయంలో మౌనంగా ఉండటమే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలకు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యంగా కనిపిస్తోంది. లెక్కకు మిక్కిలి నాయకులను తీసుకున్నా కూడా వారిని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.
పార్టీల్లోనూ అంతర్గత కుమ్ములాటలు పెరుగుతాయి. నాయకుల మధ్య ఆధిపత్యం పెరుగుతుంది. ప్రస్తుతం మైలవరంలో అయితే జరుగుతుంది. ఈ ఒక్క చోటే కాదు నూజివీడులోనూ ఇలాంటి పరిణామం కనిపిస్తోంది. దీనిని అంచనా వేసిన చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైసిపిని పూర్తిస్థాయిలో ఖాళీ చేయకపోయినా వైసీపీకి బలమైన గళాన్ని లేకుండా చేయాలనేది మాత్రం బాబు వ్యూహం. మరి ఏ మేరకు ఈ విషయంలో ఆయన సక్సెస్ అవుతారో చూడాలి.